Saturday, September 21, 2024
HomeTrending Newsరుధిర పుష్పంగా చంద్రుడు

రుధిర పుష్పంగా చంద్రుడు

Lunar Eclipse 2022 : ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణానికి సమయం ఆసన్నమైంది. అది కూడా అలాంటి ఇలాంటి గ్రహణం కాదు. నెత్తుటి మరకలంటినట్టు ఆకాశంలోని చంద్రుడు రుధిర పుష్పంగా వికసించనున్నాడు. అవును, దాదాపు ప్రపంచమంతటా ఈ చంద్రగ్రహణం వస్తోంది. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చంద్రగ్రహణం కనిపించింది.

ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు ఉంది. మన కాలమానం ప్రకారం ఈ రోజు(సోమవారం) ఉదయం 7.57 గంటల నుంచి 10.15 గంటల వరకు ఉండనుంది. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయే ముందు ఎర్రటి రంగులోకి మారిపోయడని సైంటిస్టులు చెబుతున్నారు.

సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రం చెల్లా చెదురవుతాయని, ఎరుపు, నారింజ రంగులు మాత్రం కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని పేర్కొన్నారు. గ్రహణం సమయంలో చంద్రుడు కొద్దిసేపు మాయమైపోతాడని చెప్పారు. అయితే, చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ్లద్దాలు అవసరం లేదని, రక్షణపరికరాల్లేకుండానే చూడవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. గ్రహణం పతాక స్థాయికి చేరినప్పుడు చంద్రుడు 3,62,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడని సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే మన దేశంలో గ్రహణం చూసే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే రుధిర చంద్రుడు దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు చెప్పారు. రోమ్, బ్రసెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జొహెన్నస్ బర్గ్, లాగోస్, మాడ్రిడ్, సాంటియాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, గ్వాటెమాలా సిటీ, రియో డి జనేరో, షికాగోల్లో సంపూర్ణ చంద్రగ్రహణన్ని వీక్షించే అవకాశం వచ్చింది. అంకారా, కైరో, హొనొలులు, బూడాపెస్ట్, ఏథెన్స్ లలో పాక్షిక గ్రహణమే దర్శనమిచ్చింది.

మన దేశంలో గ్రహణం పట్టట్లేదు కాబట్టి చూడలేమన్న వారి కోసం నిరాశ లేకుండా నాసాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. గ్రహణాన్ని చూడాలనుకునే వారి కోసం ఈ రోజు ఉదయం 8.33 గంటలకు నాసా వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేశారు. కాగా, ఈ ఏడాది మొత్తంగా రెండు చంద్రగ్రహణాలు దర్శనమివ్వనున్నాయి. ఇవాళ్టిది మొదటిది కాగా.. రెండో గ్రహణం నవంబర్ 8న కనువిందు చేయనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్