సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశాలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానంతోపాటు రాంపూర్ సదర్, ఖతౌలీ అసెంబ్లీ సీట్లు, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో ఉపఎన్నిక జరుగుతున్నది. వీటిలో ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ యేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈ రోజు (సోమవారం) సాయంత్రం నాటికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్గిట్ పోల్స్ వెలువడతాయి.
కాగా, మెయిన్‌పురి లోక్‌సభ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్నది. అక్కడ ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో డింపుల్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు అంటున్నారు. అఖిలేష్ కుటుంబానికి మొదటి నుంచి ఈ ప్రాంతంపై గట్టి పట్టు ఉంది.