Saturday, November 23, 2024
HomeTrending Newsఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గే

ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గే

ఎన్.డి.ఏ కూటమి నేతలు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 22 వ తేది వరకు దేశ రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరోవైపు ఇండియా కూటమి నేతలు వచ్చే లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా కార్యక్రమాల నిర్వహణ, కూటమి బలోపేతానికి చర్యలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని చర్చించేందుకు శనివారం(డిసెంబర్-13) కూటమి వర్చువల్‌ విధానంలో సమావేశమైంది.

త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. ఆదివారం (జనవరి 14)నుంచి మణిపూర్‌లో ప్రారంభం కానున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర, ప్రతిపక్షాలు అందులో పాల్గొనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రతిపక్షాల కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి అన్న దానిపై చర్చ జరిగింది. బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ కూటమి కన్వీనర్‌ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. కన్వీనర్‌ పదవి చేపట్టేందుకు నితీశ్‌ విముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నుంచే ఒకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నితీశ్‌ అభిప్రాయపడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జునఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్‌గా ఉన్నారు. అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.

ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ సిద్దంగా లేరు. జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్‌ తో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు తకరారు కానుంది.

సమావేశానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ డుమ్మా కొట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ప్రహాసనంగా మరే ముప్పు ఉంది. సిఎం మమత బెనర్జీ అధిక స్థానాలు డిమాండ్ చేస్తారు. రాష్ట్రంలో ఉనికి చాటేందుకు కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్… రెండు మూడు కన్నా అధిక సీట్లు కోరితే పొత్తు వికటించే ప్రమాదం ఉంది.

దక్షిణ భారత దేశంలో మిత్ర పక్షాలతో ఇబ్బంది లేదు. తమిళనాడులో మినహా కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా బోణీ కొట్టాలని కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్