ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబుతే బీజేపీ వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది బీజేపీ వాళ్ళు వివరించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ వాళ్ళు లేరనేది వాస్తవం కాదా అని మల్లు రవి హైదరాబాద్ గాంధి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ రోజు ప్రశ్నించారు. మల్లికార్జున్ ఖర్గే క్షమాపణ చెప్పాల్సిన అవసరం కంటే బీజేపీ వాళ్ళే క్షమాపణ చెప్పాలన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని, మల్లికార్జున ఖర్గే ను రబ్బరు స్టాప్ అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక దళిత నేతగా ఖర్గే ఓటమి ఎరగని నాయకులు.. ఖర్గే 8 సార్లు ఎమ్మెల్యే గా, మూడుసార్లు ఎంపీ గా, గెలవడమే కాకుండా కర్ణాటక లో హోమ్, పరిశ్రమలు, నీటి పారుదల మంత్రిగా, సీఎల్పీ నేతగా కేంద్రంలో రైల్వే, లేబర్ మంత్రిగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులుగా పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆయన ఎన్నికల ద్వారా అత్యధిక మెజారిటీ తో గెలిచిన ఏఐసీసీ అధ్యక్షులు, ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలిచాయన్నారు. అలాంటి వ్యక్తిని రబ్బర్ స్టాంప్ అంటారా.. ? బీజేపీలో అమిత్ షా, మోడీ తప్ప మిగతా వాళ్ళందరూ రబ్బరు స్టాప్ లే అన్నారు.
దళితులను అవమాన పరిచే విధంగా బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారని, స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ సిద్ధాంతాలే నేటికి కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అంటే వ్యక్తులు కాదు ఒక సిద్ధాంతం..బీజేపీ కి ఏ ఐడియాలజీ లేకనే ఇతర పార్టీల నుంచి చేరికలు చేసుకుంటున్నారని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కి వస్తున్నారని..సీనియర్ నేతలతో చర్చించి వారితోపాటు ఇతర నాయకులతో కూడా మాట్లాడి సమన్వయ పరిచి కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తారని మల్లు రవి వెల్లడించారు.