మధ్యధర సముద్ర తీరంలోని కీలక దేశాల్లో ఒకటైన మాల్టాలో భారత కొత్త హైకమీషనర్‌గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి గ్లోరియా గాంగ్టే నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో గాంగ్టే పనిచేస్తున్నారు.భారత్- మాల్టాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగున్నాయి. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరిస్తూ ఇరుదేశాలు సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి మాల్టాలో పర్యటించిన నెల లోపే గాంగ్టే నియామకం జరగడం విశేషం. ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన మీనాక్షీ లేఖీ పర్యటనలో భాగంగా మాల్టా అధ్యక్షుడు డాక్టర్ జార్జ్ వెల్లాతో ఆమె భేటీ అయ్యారు.అలాగే విదేశాంగ మంత్రి ఇయాన్ బోర్గ్, పర్యాటక శాఖ మంత్రి క్లేటన్ బార్టోలో, హెరిటేజ్ శాఖ మంత్రి డాక్టర్ ఓవెన్ బొన్నికీలను కూడా కేంద్ర మంత్రి కలుసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సహకారం, సౌరశక్తి, చలనచిత్రాలు, పర్యాటకంపై ఇరుదేశాలు చర్చలు జరిపాయి. ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఐసీటీ రంగాల్లో మాల్టా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 112 భారతీయ కంపెనీల సహకారాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం మాల్టాలో ప్రవాస భారతీయులు గణనీయంగా ఉన్నారు. అక్కడ భారతీయులు ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేస్తున్నారు. పర్యాటక రంగంలో మాల్టా పేరెన్నికగన్నది. కోవిడ్ 19 సమయంలో భారతీయులు అందించిన సేవలకు ప్రశంసలు దక్కాయి. ఇకపోతే.సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బండారు విల్సన్‌బాబును మడగాస్కర్‌లో భారత రాయబారిగా నియమించినట్లు గతవారం కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.త్వరలోనే ఆయన రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు మడగాస్కర్‌లో అభయ్ కుమార్ భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు.