Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన మన బస్తీ – మన బడి

హైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన మన బస్తీ – మన బడి

హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలో మన బస్తీ – మన బడి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLC లు MS.ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, RJD విజయలక్ష్మి, TSEWIDC EE షఫీ, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ప్రభుత్వం మన ఊరు –మనబడి, మన బస్తీ – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను ప్రభుత్వం గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, వీటికి ఎస్టిమేషన్ లను కూడా సిద్దం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల MLA లు వారి వారి నియోజకవర్గాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయుట, పాఠశాల భవనాలకు కలర్స్ వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం వంటి మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనే విధంగా అభివృద్ధి తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్ధుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, పాఠశాలల్లోని సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మన బస్తీ – మన బడి పనులను పర్యవేక్షించాల్సిన బాద్యత డిప్యూటీ DEO లపై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా MLA ల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందించనున్నదని తెలిపారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానం లేని చోట్ల GHMC కి చెందిన స్థలాలను గుర్తించి విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Also Read : మన ఊరు- మన బడిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్