ఈ మధ్య కాలంలో ఎవరినోట విన్నా ‘మంజుమ్మల్ బాయ్స్’ పేరే వినిపించింది. మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు .. ఇతర ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించింది. 2006లో కొడైకెనాల్ లో జరిగిన ఒక సంఘటనకు ఈ సినిమా తెర రూపాన్ని ఇచ్చింది. తమిళంలోను .. తెలుగులోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూఎస్ లోను ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.
యూఎస్ లో ఈ సినిమా ఇప్పటికే 1మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. మలయాళ సినిమా ఇక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే ఫస్టు టైమ్. రోజు రోజుకి ఈ సినిమాకి అక్కడ కలెక్షన్స్ పెరుగుతూ ఉండటం విశేషం. అందువలన 2 మిలియన్ క్లబ్ కి ఈ సినిమా చాలా దగ్గరగా వెళ్లిందని అంటున్నారు. 2 మిలియన్ క్లబ్ లోకి చేరిన మొదటి మలయాళ సినిమాగా ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.
40లలో పడిన కొంతమంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ లోని ‘గుణ కేవ్స్’ ను చూడటానికి వెళతారు. వాళ్లలో సుభాష్ అనే యువకుడు ఒక ఆ గుహలోని అగాధంలోకి జారిపోతాడు. అతనిని బయటికి తీయడానికి మిగతా ఫ్రెండ్స్ ఏం చేశారనేదే కథ. ఈ ఫ్రెండ్స్ కి కాస్త ఉత్సాహం .. ఆకతాయి పనులు ఎక్కువ అనే విషయాన్ని మొదటి అరగంటలో రిజిస్టర్ చేసిన దర్శకుడు, ఆ తరువాత నుంచి సీట్ ఎడ్జ్ పై కథను నడిపిస్తాడు. చివరివరకూ అదే ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళ్లాడు. భాష .. ప్రాంతంతో సంబంధం లేని కంటెంట్ కావడం వలన, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది.