పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో మార్‌బర్గ్ వైరస్ కలకలం రేపింది. వైరస్ బయటపడిన తొలి రోజే తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వైరస్ సోకిన వ్యక్తులు హెమరేజిక్ ఫీవర్ బారిన పడుతారని, అంటే తీవ్రంగా జ్వరం వచ్చి రక్తనాళాలు చిట్లిపోతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు ఎబోలా వైరస్ సోకిన వారి లక్షణాలను పోలి ఉంటాయని పేర్కొంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది సోకిన వక్తికి దగ్గరగా వెళ్లిన ఇతర వ్యక్తులకు కూడా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వైరస్‌కు చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఈక్వెటోరియల్ గినియాలో సోమవారం 9 మంది తీవ్ర జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని, వారి శాంపిల్స్‌ను పరీక్షించగా మార్‌బర్గ్ వైరస్ ఉన్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్‌వో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వైద్య బృందాలు తరలివెళ్లాయని.. ప్రాథమిక కాంటాక్టులను గుర్తించి, వారికి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారని తెలిపింది.
డబ్ల్యూహెచ్‌వో తరపున అత్యవసర వైద్య సిబ్బందిని, అవసరమైన సామాగ్రిని గినియాకు పంపినట్లు ఆ సంస్థకు చెందిన ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మస్తిడిసో మొయేటీ తెలిపారు. మార్‌బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని, వైరస్ ను వేగంగా గుర్తించి, తగిన చర్యలు చేపట్టిన గినియా వైద్యాధికారులకు కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు.