నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడడం ఖాయమని వైఎస్సార్ సిపి లోక్ సభ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇటీవలే లోక్ సభ స్పీకర్ ను కలిసి అనర్హత పై రిమైండర్ నోటీసు కూడా ఇచ్చామని, త్వరలోనే అయన చర్యలు తీసుకుంటారని భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనర్హత వేటు తప్పించుకోడానికి రఘురామ కృష్ణంరాజు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, స్పీకర్ ను కలిసినంత మాత్రాన చర్యలు ఆగవని, ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటారని వెల్లడించారు.
రఘురామ కృష్ణమరాజుకు పౌరుషం ఉంటే తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసినట్లు చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేసి పోటీ చేస్తే రఘురామకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు స్పీకర్ కు సమర్పించామని, వేటు ఖాయమని భరత్ వివరించారు.
ఇటీవల సిఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన సమయంలోనే భరత్ స్పీకర్ ను మరోసారి కలిసి అనర్హత వేటుపై మరోసారి పిటిషన్ ఇచ్చారు. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో లోపే రఘురామపై వేటు ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధృడంగా విశ్వసిస్తోంది.