అమెరికా, నాటో దేశాలు రష్యాను కట్టడి చేయాలని సకల కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే… రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మాత్రం ఇవేవి పట్టించుకోనట్టే తన పని తానూ చేసుకు వెళుతున్నాడు. ఉక్రెయిన్ తో యుద్దంలో రష్యా సైన్యంలో ధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు వారితో కలుస్తున్నారు. తాజాగా పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేశారు. పశ్చిమ దేశాల తీవ్ర నిఘా ఉన్న సమయంలోనే రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మరియుపోల్‌లో పుతిన్ ఆకస్మిక పర్యటన చేశారు. హెలీకాప్టర్ ద్వారా మరియుపోల్ వెళ్లిన పుతిన్ అక్కడ స్వయంగా కారు నడుపుతూ పలు ప్రదేశాలు తిరిగారని రష్యా అధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఎప్పుడు ఈ పర్యటన జరిగిందనేది మాత్రం బయటపెట్టలేదు. అక్కడ ఆయన స్థానికులతో మాట్లాడుతున్న వీడియోను రష్యా ఛానళ్లు ప్రసారం చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధంలో మరియుపోల్ నగరం తీవ్రంగా నష్టపోయింది. యుద్ధం వల్ల దాదాపు లక్షమంది ప్రజలు ఈ నగరాన్ని వీడి వెళ్లారు.