కోట్లు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం ముఠాను సైబరాబాద్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ‘మార్కెట్ బాక్స్ యాప్’ అనే ఓ యాప్ ద్వారా కొందరు ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపారం అంటూ అనేక మందిని ఆకర్శించారు. పది మంది సభ్యులు గల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ముఠా నడుపుతున్న ఈ యాప్ మోసపు వలలో అనేక మంది పడిపోయారు. దాదాపు 10 కోట్ల మేర నష్టపోయారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ యాప్ లో 62 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. 34 లక్షలు కోల్పోగా ఆయన సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు ఆ ముఠా రాజస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. వాళ్ళను పట్టుకోవడానికి పోలీసు బృందం వెళ్ళి రకరకాల వేశాలతో మూడు నెలలపాటు కాపు కాసి చివరికి ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వాళ్ళ నుండి 9 కోట్ల 81 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన డబ్బుతో వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మెన్ లుగా కొనసాగుతున్న అభిషేక్ జైన్, పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్, కృష్ణ కుమార్ లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దోచుకున్న సొమ్ముతో అక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్కెట్ బాక్స్ యాప్ సెబీ లో నమోదు కాలేదని, ప్రజలు ఏ విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఆ యాప్ లో ఉన్న వివరాలన్నీనిజమే అని నమ్మేయడం వల్ల సులభంగా మోసపోతున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Also Read : సైబర్ క్రైమ్ అంతు చూడాలి సిఎం కెసిఆర్