Tuesday, December 3, 2024
HomeTrending Newsకొండప్రాంతాల్లో చిక్కుకున్న బద్రీనాథ్ యాత్రికులు

కొండప్రాంతాల్లో చిక్కుకున్న బద్రీనాథ్ యాత్రికులు

వరుణుడి ఉగ్ర రూపానికి హిమాలయాల్లో కొండలు, లోయలు ఏకమవుతున్నాయి. కుండపోత వానలకు హిమగిరులు జలమయం అయ్యాయి. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో పర్వత ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కొండచరియలు విరిగిపడి జమ్ముకాశ్మీర్ జీవనాడిగా పేరున్న మొఘల్ రోడ్ రెండు రోజులపాటు మూతపడింది. అదే కోవలో ఎడతెరిపి లేని వర్షాలకు ఉత్తరాఖండ్‌ లో భారీగా కొండ చరియలు విరిగి పడుతున్నాయి.

ఉత్తరాఖండ్ లో ఓ వైపు వరదలు మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్‌ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బనేర్ పాణి – చమోలి రహదారిని సుమారు 48 గంటల పాటు ప్రభుత్వం మూసివేసింది.

కొత్వాలి చమోలి ప్రాంతంలోని ఆంగ్ తాల సమీపంలో భారీగా బండరాళ్ళు పడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారి మూతపడింది. ఈ రోజు (గురువారం) ఉదయం 6.54 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్థానిక అధికారులు, పోలీసులు శిధిలాలను తొలగించడానికి ఆపరేషన్ ప్రారంభించారు.

జాతీయ రహదారి మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్‌, నీతి, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. సుమారు 2,000 మంది యాత్రికులు రహదారిపై చిక్కుకున్నారు. రహదారిని పునరుద్దరించేందుకు BRO(బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌) అధికారులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్‌కవేటర్లను అక్కడ మోహరించారు.

వారం రోజుల క్రితం కర్ణప్రయాగ, గౌచర్‌ మధ్య బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన  యాత్రికులు నిర్మల్‌ షాహీ, సత్యనారాయణలు బద్రీనాథ్ దర్శించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపడి వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్‌ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్