ఉత్తరప్రదేశ్ లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటి చేయదని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అక్రమాలతో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని విమర్శించారు. జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి కైవసం చేసుకునేందుకు సభ్యులను కొనుగోలు చేసే యత్నాలకు బిజెపి నేతలు అధికారాన్ని వాడుకుంటారని ఆరోపించారు. అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ఈ రోజు చెప్పారు. సమాజ్ వాది పార్టీ ప్రభుత్వంలో అఖిలేష్ యాదవ్ ప్రవేశ పెట్టిన లోప భూయిష్టమైన విధానాలనే యోగి ఆదిత్యనాథ్ కొనసాగిస్తున్నారని మాయావతి ఆరోపించారు. అఖిలేష్ తరహాలోనే బిజెపి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటిచేయకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని బిఎస్ పి నేతలకు మాయావతి పిలుపు ఇచ్చారు. రాపోయే శాసనసభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాయావతి చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొట్టు లేకుండా బి ఎస్ పి సొంతంగానే అన్ని స్థానాల్లో పోటి చేస్తుందని ఇదివరకే మాయావతి ప్రకటించారు.