మూడు రాజధానులకు రాష్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే మూడురాజధానులు ఏర్పాటు చేశామన్నారు. భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాజధాని అనే పదమే లేదని అయన గుర్తు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుందని, అది విశాఖ కావచ్చు, పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చని మేకపాటి వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, అమరావతి ప్రాంత రైతులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని ఇటీవల మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బొత్స వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా మంత్రి గౌతమ్ రెడ్డి కూడా రాజధానిపై ప్రభుత్వ విధానాన్ని తేల్చి చెప్పడంతో అతి త్వరలో విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే వార్తలకు బలం చేకూరింది.