నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నిత్యం కాలుష్యం, ఒత్తిడి మధ్య మనం మన అందాన్ని కాపాడుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. రకరకాల క్రీములు, లోషన్లు, ఫేషియల్స్ వాడుతున్నాం. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖంలో ఆ ‘గ్లో’ రావడం లేదా? అయితే, సమస్య మీ చర్మంలో లేదు.. మీ మనసులో ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. మన ఆలోచనలకు, మన చర్మ సౌందర్యానికి మధ్య విడదీయలేని బంధం ఉందంటున్నారు నిపుణులు.
చర్మం- మీ భావోద్వేగాల డిజిటల్ బోర్డు
మీ చర్మం కేవలం శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు; అది మీ లోపలి భావోద్వేగాలను ప్రతిబింబించే ఒక పెద్ద డిజిటల్ బోర్డు. మీరు సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, కోపంతో రగిలిపోతున్నా.. ఆ ప్రభావం వెంటనే మీ ముఖంపై కనిపిస్తుంది. అందుకే, లోపల ప్రశాంతత లేనప్పుడు పైన ఎన్ని మెరుగులు దిద్దినా ఫలితం ఉండదు.
కోపం- ఒత్తిడి…అందానికి శత్రువులు
మనం విపరీతమైన కోపంతో లేదా ఒత్తిడితో ఉన్నప్పుడు మన శరీరం ‘కార్టిజాల్’ అనే హార్మోన్‌ను విచ్చలవిడిగా విడుదల చేస్తుంది. దీనివల్ల కలిగే నష్టాలు ఇవే:
- మొటిమలు: కార్టిజాల్ వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు పెరుగుతాయి.
- ముడతలు: నిరంతరం కోపంగా ఉండటం వల్ల నుదుటిపై ముడతలు పడి, వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.
- జుట్టు రాలడం: భయం, ఆందోళన వల్ల రక్త ప్రసరణ తగ్గి జుట్టు పలుచబడటం మొదలవుతుంది.

మీ లోపలే ఉంది ‘దివ్యౌషధాల ల్యాబొరేటరీ’
ఖరీదైన సౌందర్య సాధనాల అవసరం లేకుండానే, మీ శరీరం సహజంగా ఉత్పత్తి చేసే నాలుగు ‘హ్యాపీ హార్మోన్లు’ మీ చర్మాన్ని పదికాలాల పాటు కాంతివంతంగా ఉంచుతాయి:
- డొపమైన్: దీనిని ‘గోల్ గెట్టర్’ హార్మోన్ అంటారు. మీరు ఏదైనా చిన్న పనిని పూర్తి చేసినప్పుడు లేదా మంచి సంగీతం విన్నప్పుడు ఇది విడుదలై చర్మానికి ఉత్సాహాన్నిస్తుంది.
- ఎండార్ఫిన్లు : ఇవి శరీరానికి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ఇవి ఉత్పత్తి అయి చర్మాన్ని రిలాక్స్ చేస్తాయి.
- ఆక్సిటోసిన్ : దీనిని ‘లవ్ హార్మోన్’ అంటారు. ఆత్మీయులతో గడపడం, ప్రేమని పంచడం వల్ల ఇది విడుదలై చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తుంది.
- సెరోటోనిన్: మీ మూడ్ మెకానిక్. ధ్యానం చేయడం లేదా ఉదయపు ఎండలో కాసేపు నడవడం వల్ల ఇది విడుదలై చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
డెర్మటాలజిస్టులు ఏమంటున్నారు?
ప్రముఖ డెర్మటాలజిస్టుల ప్రకారం, చర్మ సమస్యలతో వచ్చే వారిలో 40% మంది మానసిక ఒత్తిడి వల్లే ఆ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే, కేవలం మందులు మాత్రమే కాకుండా మెడిటేషన్ పాజిటివ్ థింకింగ్ కూడా చికిత్సలో భాగంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

ప్రశాంతతే అసలైన మేకప్!
పది రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయ్యే కంటే, ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం సాధన చేయండి. మీ మనసును ఆహ్లాదంగా ఉంచుకోండి. అప్పుడు మీ మెదడు విడుదల చేసే హార్మోన్లు మీకు ఉచితంగా ‘బయోలాజికల్ ఫేషియల్’ చేస్తాయి. గుర్తుంచుకోండి… కడిగితే పోని ఏకైక మేకప్ మీ ‘ప్రశాంతమైన మనసు’ మాత్రమే!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

