Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయలసీమ వాణిజ్య రాజధాని…సాహిత్య పురి

రాయలసీమ వాణిజ్య రాజధాని…సాహిత్య పురి

కడప జిల్లాలో పెన్నానదీ తీరాన ఉన్న ప్రొద్దుటూరు పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం, బట్టల వ్యాపారం. అందుకే దీనిని ‘రెండో బొంబాయి’ అని పిలుస్తారు. అయితే ప్రొద్దుటూరు కేవలం వ్యాపారానికే కాదు, అద్భుతమైన సాహిత్యానికి, కళలకు, చారిత్రక నేపథ్యానికి నిలయం.

సాహిత్య వైభవం-పుట్టపర్తి వారి శివతాండవం

ప్రొద్దుటూరు గడ్డపై ఎందరో మహానుభావులు జన్మించి తెలుగు సాహిత్య కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు.

పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు:- ఈ పట్టణం నడిబొడ్డున ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో కూర్చునే ఆయన తన అద్భుత కావ్యం ‘శివతాండవం’ రచించారు. అగస్త్య మహర్షి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉండటం విశేషం. పుట్టపర్తివారి గౌరవార్థం ఆలయ కూడలిలో 11 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

గడియారం వేంకట శేషశాస్త్రి:- అద్భుత కావ్యం శివభారతం రచించిన వీరు ప్రొద్దుటూరుకు మరో గర్వకారణం.

ఇతర ప్రముఖులు:- శతావధాని సి.వి. సుబ్బన్న, సుకవి నరాల రామారెడ్డి, సరళకవి రాజన్న కవి వంటి వారు ఈ నేల కీర్తిని పెంచారు.

రాజకీయ ఉద్యమం-RTPP నిర్మాణం:- ప్రముఖ కథా-నవలారచయిత, రాయలసీమ విమోచన సమితి నేత డా|| ఎం.వి. రమణారెడ్డి (మాజీ MLA) చేసిన పోరాట ఫలితంగానే ముద్దనూరులో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (RTPP) ఏర్పడింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రాజెక్టుకు ‘డా|| ఎం.వి. రమణారెడ్డి థర్మల్ పవర్ ప్రాజెక్ట్’ అని నామకరణం చేశారు.

స్వర్ణపురి: గోల్డ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్:-

ప్రొద్దుటూరును “స్వర్ణపురి” అని పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

నాణ్యత & డిజైన్లు:- ఇక్కడి బంగారం నాణ్యతకు మారుపేరు. పాతకాలపు నగిషీల నుండి లేటెస్ట్ ట్రెండీ డిజైన్ల వరకు ఇక్కడ లభిస్తాయి.

తక్కువ మజూరీ:-  ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు.

వస్త్ర వ్యాపార అడ్డా:-

బంగారంతో పాటు ప్రొద్దుటూరు బట్టల వ్యాపారానికి పెట్టింది పేరు. రాయలసీమలోనే అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ ఇక్కడ ఉంది. సూరత్, ముంబై వంటి నగరాల నుండి నేరుగా దిగుమతి చేసుకుని అత్యంత తక్కువ ధరలకే ఇక్కడ విక్రయిస్తారు.

పర్యాటక ఆకర్షణ-గండికోట:-

ప్రొద్దుటూరుకు కేవలం 40 కి.మీ. దూరంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గండికోట ఉంది. పెన్నా నది కోతకు ఏర్పడిన అద్భుతమైన లోయలు (Gorge), చారిత్రక కోటలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

నమ్మకమే పెట్టుబడిగా దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న వ్యాపారాలు, గొప్ప సాహితీ నేపథ్యం కలిగిన ప్రొద్దుటూరు కడప జిల్లాకే ఒక మణిమకుటం. చారిత్రక వారసత్వం, వాణిజ్యం ఆధునికతల కలయిక ప్రొద్దుటూరు.

దోసెలు బేత్సావా బీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular