Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

“శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్;
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్”

చూడచక్కని రూపంతో పాటు మిగతా సౌభాగ్యాలు ఎన్ని ఉన్నా నీ మనసు గురువు పాదాలమీద లగ్నం కాకపొతే ఏమి ప్రయాజనం? అన్నాడు శంకరాచార్యులు గుర్వష్టకంలో. పైగా ఆ ప్రశ్నను నాలుగుసార్లు మకుటంలో బిగించాడు. శంకరుడు ఒక శ్లోకంలో పొరపాటున కూడా వాడిన మాటను మళ్లీ వాడడు. అలాంటిది తతః కిమ్ అన్న ప్రశ్నను నాలుగు సార్లు ఉపయోగించాడంటే ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలని మనల్ను అంతగా అడుగుతున్నాడు. ఎనిమిది శ్లోకాలు లేదా చివరి తొమ్మిదోది కలుపుకుంటే…ఆ ప్రశ్న 32…36 సార్లు వస్తోంది. మేరు పర్వత సమానమయిన ధనరాశి మనదగ్గర ఉన్నా…ఏది జ్ఞానమో చెప్పే గురువు లేకపోతే ఆ ధనరాశి ఎందుకూ కొరగాదు పొమ్మన్నాడు.

కాలగతిలో- ధనరాశి ఉంటే చాలు…గురువే మన కాళ్ల దగ్గరికి వస్తాడనే అజ్ఞానం మనలో మేరు పర్వతమంతగా పేరుకు పోయింది. అది వేరే విషయం.

గురువును సాక్షాత్తు బ్రహ్మ- విష్ణు- మహేశ్వరుడిగా…సకల దేవతల ప్రతిరూపంగా చూసే ఆచారం మనది.

1 . బోధక గురువు;
2 . వైదిక గురువు;
3 . ప్రసిద్ధ దేశికులు;
4 . కామ్యక గురువు;
5 . వాచక గురువు;
6 . సూచక గురువు;
7 . కారణ గురువు;
8 . విహిత గురువు-
అని ఎనిమిది రకాల గురువులుంటారు. ఇందులో ఏయే గురువుల పాత్ర ఏమిటి? వారివల్ల మనకు ప్రయోజనమేమిటి? అన్న చర్చకు ఇది వేదిక కాదు.

ఈ గురువుల లిస్ట్ ఎప్పుడో వేదకాలం నాటిది. ఇప్పుడు ఎనిమిది దాటి గూగుల్ గురువు, కిండెల్ గురువు, బైజూస్ గురువు, అన్ అకాడెమి గురువు, వాట్సాప్ గురువు, ఫేస్ బుక్ గురువు, యూ ట్యూబ్ గురువు, ట్యాబ్ గురువు, ఆన్ లైన్ గురువు, ఆఫ్ లైన్ గురువు, కోటా గురువు, నారాయణ గురువు, చైతన్య గురువు, శిక్ష గురువు, నిర్బంధ గురువు, బరువు గురువు, డబ్బు గురువు, కాపీ గురువు, డొంకతిరుగుడు గురువు, గుగ్గురువు…సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీల్లేని ఇంకా ఎందరో గురువులు తోడయ్యారు.

గురు సంప్రదాయంలో ఈ గురువుల పాత్ర వేరు. సాధారణంగా మనమనుకునే టీచర్ – గురువుకు పరిమితమయితే ఇందులో నుండి బోధక, వాచక, సూచక గురువుల అవసరం అడుగడునా ఉంటుంది. ఉన్నదున్నట్లు బోధించేవారు బోధక గురువులు. విషయాన్ని అనుభవంలోకి వచ్చేలా చెప్పేవారు వాచక గురువులు. ఇంద్రియ నిగ్రహం కలిగించి ప్రపంచ కార్యకారణ సంబంధాలను అవగాహనలోకి తెచ్చేవారు సూచక గురువులు. ఇంకా నిషిద్ధ గురువు లాంటి లిస్టు ఉంది కానీ…ఆ వివరాలన్నీ ఇక్కడ అప్రస్తుతం.

ఆధునిక లోక వ్యవహారంలో బోధక, వాచక, సూచక గురువులకు కొంచెం అర్థం మారినట్లుంది. బోధించేవారు, వివరించి చెప్పే వారు, సూచన చేసేవారు అని అనుకుంటున్నారు. మాటల లిటరల్ మీనింగ్ ను బట్టి అలా అనుకున్నారు. తప్పు కాదు.

ఏ వృత్తిలో ఉన్నా కొందరు బోధనను ప్రవృత్తిగా కొనసాగిస్తూ ఉంటారు. ఇరవై, ముప్పయ్ ఏళ్ల పాటు తాము చదివిన చదువును, మెళకువలను, జ్ఞానాన్ని, అనుభవాలను కొత్త తరానికి అందించాలన్న ఆరాటానికే మొదట చేతులెత్తి మొక్కాలి. ప్రవృత్తిగా టీచింగ్ లో ఉన్న చాలా మంది ఉచితంగానే బోధిస్తుంటారు. ప్రవహిస్తేనే జ్ఞానానికి విలువ. నిలువ ఉంటే మురుగు కంపు కొడుతుంది.

ఉమ్మడి రాష్ట్రంలో డి జి పి గా పనిచేసిన కె. అరవింద రావు అద్వైతం మీద సంస్కృతంలో పి హెచ్ డి చేశారు. పోలీస్ ఉన్నతాధికారిగా ఉంటూ ఆయన ప్రఖ్యాత పండితుడు మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు దగ్గరికి విద్యార్థిగా వెళ్లి చదువుకున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తూనే భారతీయ ఆధ్యాత్మిక విషయాల మీద ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతంలో వ్యాసాలు రాశారు. పదవీ విరమణ తరువాత అద్వైత వేదాంత బోధనలో బిజీగా ఉన్నారు. ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత సాహిత్యాలను ఇష్టంగా, లోతుగా అధ్యయనం చేశారు.నక్సలిజం మీద చాలా కఠినంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు యూ ట్యూబ్ లో శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని ఇంగ్లీషులో చక్కగా, అత్యంత సరళంగా విడమరచి చెబుతూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. బంధ- మోక్షాల అడ్డంకులు, విముక్తులు తెలిసినవాడు కాబట్టి తన ప్రపంచంలో తను హాయిగా ఉన్నారు.

Rachakonda CP Mahesh Bhagwat helps Civil Services aspirants

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా బోధనలోనే ఉన్నారు. ఇటీవలి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకున్న అభ్యర్థుల్లో 20 మంది ఎంపికయ్యారు. ఇప్పటిదాకా వెయ్యి మంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ సాధించడానికి ఆయన చేతనయిన విద్యాదానం చేశారు.

సివిల్ సర్వీస్ తుది మెట్టు మౌఖిక పరీక్ష- ఇంటర్వ్యూ చాలా కీలకం. ఇంటర్వ్యూ లో ఎలా మాట్లాడాలి? ఇంటర్వ్యూ కు ఎలా ప్రిపేర్ కావాలి? ఇదివరకటి అనుభవాలు…గుదిగుచ్చి ఆయన చాలా ఏళ్లుగా అభ్యర్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఈరోజుల్లో ఉన్న సమాచార సాంకేతిక విజ్ఞానం, వాట్సాప్ లు ఆయనకు మరింత తోడుగా నిలిచాయి.

ప్రతి ఏటా మహేష్ భగవత్ సలహాలు తీసుకున్న అభ్యర్థులు పదుల సంఖ్యలో సెలెక్ట్ అవుతున్నారు. తను పడ్డ కష్టం ఇంకొకరికి ఎదురు కాకూడదన్న సత్సంకల్పంతో ఆయన మొదలు పెట్టిన ఈ టీచింగ్ లో బోధన ఉంది. వాచకం ఉంది. సూచన ఉండనే ఉంది.

“ఎవరో ఒకరు
ఎపుడో అపుడు
నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు…
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది…”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

నిత్య భారసహిత స్థితి

Also Read:

బైక్ రైడింగ్

Also Read:

కలవారి చేతిలో విలువయిన కాలం

RELATED ARTICLES

Most Popular

న్యూస్