Mine Accident In Myanmar Kills 80 Workers :
మయన్మార్లో జరిగిన గని ప్రమాదంలో 80 మంది వరకూ గల్లంతయ్యారు. ఉత్తర మయన్మార్, కచిన్ రాష్ట్రంలోని ఓ రంగురాళ్ల గనిలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో 70 నుంచి 100 మంది వరకూ గల్లంతైనట్టు తెలుస్తోంది. ఒకరు చనిపోగా… 25 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాచిన్ ప్రావిన్స్ చైనా సరిహద్దులో ఉన్న హ్కాపన్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రెస్క్యూ బృందం రంగంలోకి దిగి ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారికి సాయం చేస్తున్నాయి.
మట్టిపెళ్లలు విరిగిపడడంతో వాటి కింద కార్మికులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న చెరువులోనూ బోటులు వేసుకుని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక మృతదేహం లభ్యం అయింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
హ్కాపన్ రంగురాళ్ల గనిలో ఇలాంటి ప్రమాదాలు జరగడం పరిపాటే. ప్రతి ఏడాది డజన్ల కొద్దీ మరణిస్తుంటారు. జెడ్ అనే రంగురాళ్ల గనులు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగురాళ్లకు చైనాలో భారీగా డిమాండ్ ఉండడంతో అక్కడి వ్యాపారులు కూలీల సాయంతో రంగు రాళ్లను సేకరిస్తారు. వాటిని అధిక ధరకు చైనాకు అమ్ముకుంటారు. ఆ గనుల్లో తక్కువ వేతనాలకు కూలీలు పని చేస్తుంటారు. ఈ గనులు చాలా ప్రమాదకరమైనవి, పైగా ఎటువంటి భద్రతా చర్యలు ఉండవు. వేతనాలు తక్కువిచ్చినా బతకడం కోసం కూలీలు ప్రాణాలను పణంగా పెట్టి ఈ పని చేస్తుంటారు. 2020లో హ్పకాంత్‌లోని ఒక గనిలో బురద కారణంగా 160 మందికి పైగా సజీవంగా సమాధి అయ్యారు. ఈ గనుల నిర్వహణ నిలిపివేయాలంటూ అక్కడ ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి.