జీవో నంబర్ 217 పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు రాసిన లేఖను ఎమిమిదో వింతగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. వీర్రాజు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై అయన స్పందించారు. ఈ లేఖ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసినట్లు ఉందని, గతంలో ఎప్పుడూ మత్స్యకారులు అనే పదాన్నే ఉచ్ఛరించని వీర్రాజు నేడు వారి సమస్యలపై లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. ఈ జీవోపై ఇటీవలే చంద్రబాబు లేఖ రాశారని, ఇప్పుడు సోము కూడా రాశారని, టిడిపి-బిజెపి తెరచాటు బంధం, అనైతిక బంధం ఎంతకాలం కొనసాగుతుందని అయన ప్రశ్నించారు. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడడం మానుకోవాలని అయన హితవు పలికారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ జీవోపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అప్పలరాజు మండిపడ్డారు. గతంలో మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, విభజన హామీలపై, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న సిఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు డైరెక్షన్ లో బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని, వీర్రాజు స్థాయికి ఇది తగదని పేర్కొన్నారు. బాబు చెప్పినట్లు పనిచేస్తే బిజెపి రాష్ట్రంలో ఎదగదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలన్నారు. మత్స్యకారుల సంక్షేమం గురించి చంద్రబాబు పాఠాలు చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో సిఎం జగన్ లేరని సీదిరి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కేవలం కొన్ని చెరువులను మాత్రమే వేలంపాట వేసి వాటి నుంచి వచ్చే ఆదాయంలో ౩౦ శాతాన్ని ఆయా మత్స్యకార సహకార సంఘాలకు చెందేలా జీవోలో పేర్కొన్నామని, దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నామని వివరించారు. మత్స్యకారులను రెచ్చగొట్టవద్దని, వారిలో అభాద్రతాభావాన్ని కల్పించవద్దని అప్పలరాజు విజ్ఞప్తి చేశారు.