మూడు రాజధానులపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి సిఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయంలో తమ వైఖరి మారబోదని తేల్చిచెప్పారు. చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. త్వరలో అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ముందుకు వెళతామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, అన్నివర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నామని బొత్స వివరించారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమం అందిస్తున్నామని బొత్స అన్నారు.
సిఎం జగన్ మాట తప్పారంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏ విషయంలో మాట తప్పారో చెప్పాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పింది, ప్రజలను మోసం చేసింది చంద్రబాబేనని బొత్స అన్నారు. ప్రజల ఆలోచనలను జగన్ నేరవేరుస్తున్నారని, ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని లోకేష్ కు హితవు పలికారు బొత్స.
2024 లో అధికారంలోకి వస్తామంటూ లోకేష్ చెబుతున్నారని, కానీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు.