Sunday, November 24, 2024
HomeTrending Newsదెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు

భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మరమ్మతులు చేప‌ట్టాల‌ని,  రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాతనలు పంపించాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి  ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లోని ప‌లు అంశాల మీద మంత్రి, హైద‌రాబాద్ లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగంలోని ప‌దోన్నతులు, పోస్టింగులు, ఇటీవ‌ల ప‌దోన్నతులు పొందిన డిపిఓలు, ఎంపిడీఓలకు పోస్టింగులు, కారోబార్ లు, పంపు మెకానిక్ ల స‌మ‌స్యలపై మంత్రి స‌మీక్ష జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఇటీవ‌ల కుండపోత వ‌ర్షాల కార‌ణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంట‌నే చేప‌ట్టాల‌న్నారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న వాటిని పూర్తి చేయాల‌ని ఆదేశించారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో పదోన్నతులు  పొందిన‌ 57మంది డిపిఓలు, ఎంపిడిఓలకు ఖాళీల‌ను బ‌ట్టి పోస్టింగులు ఇవ్వాల‌ని ఆదేశించారు. అలాగే ఇంజ‌నీరింగ్ విభాగంలోని ఇంజనీర్లకు పదోన్నతులు క‌ల్పించాల‌ని, ఇందుకు సంబంధించిన నివేదిక‌ సిద్ధం చేయాల‌న్నారు. కారోబార్ లు, పంపు మెకానిక్  లు ఎదుర్కొంటున్న  సమస్యలను ప‌రిశీలించి, నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వెంట‌నే వాటిని పరిష్కరించాలని  మంత్రి అధికారుల‌కు చెప్పారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో మంత్రితోపాటు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఇంజ‌నీర్ ఇన్ చీఫ్‌ సంజీవ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్