వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దెబ్బతిన్న బిజెపి ఈ ఐదింటి లో అన్ని రాష్ట్రాలు దక్కాలనే కోణంలో పావులు కదుపుతోంది. భారతీయ జనతా పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ ఇంచార్జులను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిజెపి ముగ్గురు కేంద్రమంత్రులు ఇద్దరు ఎంపీలకు సమన్వయ బాధ్యతలు ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్ బిజెపి సమన్వయ బాధ్యతలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు అప్పచెప్పింది. కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ టాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శోభ కరండ్లాజే, పార్లమెంటు సభ్యులు సరోజ్ పాండే, వివేక్ టాకూర్ లు యుపి ఎన్నికలకు కో ఇంచార్జులుగా వ్యవహరిస్తారు.

ఉత్తరఖండ్ లో ముఖ్యమంత్రుల మార్పు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యత ప్రహ్లాద్ జోషి కి అప్పగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉత్తరఖండ్ ఎన్నికలకు పార్టీ సమన్వయకర్తగా ఉంటారు. ఎంపి లాకెట్ చటర్జీ కో ఇంచార్జ్ గా ఉంటారు.

పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు, అమ్ ఆద్మీ పార్టీని నిరోధించేందుకు, మిత్రపక్షం అకాలిదాల్ తో తెగతెంపులు నేపథ్యంలో బిజెపి నాయకత్వం ముగ్గురు కేంద్రమంత్రుల్ని మోహరించింది.  పంజాబ్ ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను నియమించారు. కో ఇంచార్జ్ లుగా కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, మీనాక్షి లేఖి వ్యవహరిస్తారు.

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మణిపూర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. కో ఇంచార్జులుగా కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక్, అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ వ్యవహరిస్తారు.

గోవా ఎన్నికలపై మహారాష్ట్ర ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో గోవా ఎన్నికల సమన్వయకర్తగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవీస్ వ్యవహరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *