రాష్ట్రంలో స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 60 కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా అందజేయనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 2 వేల 340 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు, 7 వందల 20 కోట్ల రూపాయలు పట్టణ ప్రాంతాలలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందజేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదు ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా ఒక లక్ష పాడి పశువుల కొనుగోలుకు రుణ సౌకర్యం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు మహిళ సహకార డైరీ,  నార్ముల్ డైరీల సహకారంతో సుమారు మూడు వేల గ్రామాల రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నమని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్త్రీ నిధి ద్వారా 742 కోట్ల రుణాలను అందించగా, గత ఏడేళ్ల కాలంలో 11 వేల 683 కోట్ల రూపాయలను మహిళా సంఘాల సభ్యులకు రుణంగా అందించామని ఆయన తెలిపారు. అన్నిరకాల అవసరాలకు సత్వర రుణ సహకార ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి సంస్థ ను స్థాపించిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మంది మహిళలు, 5 లక్షల 50 వేల సంఘాలు, 22 వేల 300 గ్రామ సమాఖ్యలు, 619 మండల, పట్టణ సమాఖ్యలు భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ స్త్రీ నిధి యని దయాకర్ రావు అన్నారు. గత ఏడేళ్ళ కాలంలో 220 కోట్ల 40 లక్షల రూపాయలను స్త్రీనిధి లాభంగా పొందిందని మంత్రి తెలిపారు.

సురక్ష భీమా పథకం వల్ల స్త్రీనిధిలో రుణం పొందిన వారు, వారి సంఘాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పథకంతో స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ ఒక లక్ష రూపాయలు వరకు జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. దీనికి తోడుగా స్త్రీనిధి మహిళా సభ్యుల పిల్లలు ఇంటర్మీడియట్ చదివేందుకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్నామని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల మహిళా స్వయం సహాయక సంఘాలలో 47 లక్షల మంది సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో మహిళ స్వయం సహాయక సంఘాలకు సెర్ప్ ద్వారా 10 వేల 448 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్త్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా అధ్యక్షత వహించారు. స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *