హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల్ నర్సింగ పూర్ ,బోర్నపల్లి గ్రామాల్లో గ్రామస్థులతో కలిసి బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పొద్దున్నే వివిద వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లపై వెళ్తున్న వారితో మాట్లాడారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు సమయానికి వస్తున్నాయని, వ్యవసాయ సాగు పెరగడంతో స్థానికంగానే చేతినిండా పని దొరుకుతుందని చెప్పారు. చిలక వాగు పై బ్రిడ్జి నిర్మాణం, కొత్త పింఛన్లు ఇప్పించాల్సిందిగా మంత్రికి ప్రజలు విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అవసరమున్న ప్రతీచోట రోడ్ల నిర్మాణం మొదలయిందని, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు, కూలిపోయే స్థితిలో ఉన్న కల్వర్టును వెంటనే బాగు చేయిస్తామన్నారు. ఈ పనులు ఎన్నికల కోసం కాదని, రైతుబందు ఎలా సక్సెస్ అయిందో, దళితబందును సైతం అదేరీతిలో సక్సెస్ చేసే ఉద్దేశంతో ఈటెల మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమేనన్నారు గంగుల.
రాష్ట్రం ఉచితంగా ఇస్తున్న కరెంట్ కు కూడా బీజేపీ మీటర్లు పెట్టాలని చూస్తొందని మంత్రి గంగుల ఆరోపించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు చేశారన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని, 24గంటల ఉచితకరెంటు, రైతుబందు, రైతుబీమా, ఆసరాఫించను, కళ్యాణలక్ష్మీ వంటి గొప్ప పథకాలు కేసీఆర్ తెచ్చారని, అన్నింట్లో తెలంగాణ ముందుందన్నారు. దళితబందు ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు మంత్రి గంగుల కమలాకర్.