Friday, April 19, 2024
HomeTrending Newsప్రమాణ పత్రం దాఖలు చేయండి: హైకోర్టు

ప్రమాణ పత్రం దాఖలు చేయండి: హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఉపాధి హామీ పథకం బిల్లుల చేల్లిమ్పుపై ప్రమాణపత్రం సమర్పించాలని ఆదేశించింది. ఉపాధి హామీ బకాయిలను జూలై నెలాఖరులోగా చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు గతంలో ఆదేశించింది. దీనిపై నేడు జరిగిన విచారణలో ప్రభుత్వ తీరు పట్ల న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

రూ. 1794 కోట్లకుగాను 413 కోట్లు చెల్లించామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అయితే పిటిషనర్ల తరఫు న్యాయవాది ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని చెప్పారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాలని, పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

హైకోర్టు సూచించినా బిల్లుల అలసత్వంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఇలాగే వ్యవహరిస్తే చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.  పూర్తి సమాచారంతో అధికారులు ఎందుకు రావడం లేదని, ప్రతి బిల్లులో 20 శాతం ఎందుకు కోత విధిస్తున్నారని, మినహాయించిన డబ్బులు ఎక్కడ ఉంచుతున్నారంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 18కి హైకోర్టు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్