విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడమే పవన్‌కళ్యాణ్‌ లక్ష్యమని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిగాయని, పవన్‌కళ్యాణ్‌ ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోసం జేఏసీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన గర్జన ర్యాలీ విజయవంతమైందని,  భారీ వర్షం కురుస్తున్నా అందరూ ఉత్సాహంగా అందులో పాల్గొన్నారని తెలిపారు.  ఈ సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులతో జనవాణి పేరుతో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన మొదలు పెట్టారని, ఇక్కడి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారా? అసలు మీకు ఈ ప్రాంతంపై మమకారం ఉందా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఇక్కడ ఓడించినందుకు మీరు ఈ ప్రాంతంపై కక్ష కట్టారని, అందుకే ఈ ప్రాంతం మీద మీరు విద్వేషాలు చూపుతున్నారని గుడివాడ వ్యాఖ్యానించారు.

ఈ సైకో పనులు ఏమిటి? మంత్రులు, నాయకుల మీద దాడి ఏమిటి? వైయస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తల్చుకుంటే మీరు కనీసం ఒక్క నిమిషం అయినా ఉండగలరా? మా ఫ్లెక్సీలు చింపడం ఏమిటి? ఏ మాత్రం క్యారెక్టర్‌ లేని వాళ్లు. అసలు నాయకుడికి క్యారెక్టర్‌ ఉంటే కదా?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ పార్టీకి ఒక సిద్ధాంతం, లక్ష్యం లేదని, ఇవేమీ లేకుండా పార్టీని నడిపితే ఇలాగే ఉంటుందన్నారు.

మంత్రులపై ఇవాళ జరిగిన ఇవాళ్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై వెంటనే పవన్‌కళ్యాణ్‌ స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇవాళ ఈ ఉద్యమానికి తూట్లు పొడవడానికి వచ్చిన పవన్, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *