నారా లోకేశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తనతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సిఎం జగన్, వారి కుటుంబ సభ్యులపై స్థాయికి మించి నోరుపారేసుకున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అనకాపల్లి శంఖారావం సభలో తనపై లోకేష్ చేసిన ఆరోపణలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను పరిహసిస్తూ గుడ్డును గిఫ్ట్ గా పంపడంపై కూడా మండిపడ్డారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం సంప్రదాయమని అందుకే తానూ కూడా పప్పు కుండను ఇస్తున్నానంటూ దాన్ని మీడియాకు ప్రదర్శించారు.
“భారతీయ సంప్రదాయం ప్రకారం మనకెవరైనా ఏదైతే బహుమతి ఇచ్చినప్పుడు.. మనం కూడా తిరిగి వారికి ఏదొకటి బహూకరించడమనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు. సంప్రదాయాల్ని పాటించే వారు. ఈ మాత్రం మర్యాద, సంస్కృతి, సంప్రదాయం మాకూ తెలుసు గనుక .. లోకేశ్‌కు ఏమివ్వాల్నా అని ఆలోచించాం. ఈక్రమంలో మా స్వగ్రామంలో శాలివాహన సామాజికవర్గీయులైన కుమ్మర్లు మా కుటుంబంతో మమేకమై ఉంటారు. మేం ఎవరికి ఏమివ్వాలన్నా.. మా ప్రాంతం తాలూకూ మట్టితో చేసిన కుండలో ఇచ్చేయాలనే ఉద్దేశంతో లోకేశ్‌కు ఇష్టమైన పప్పును వండి సిద్ధం చేశాము. దీన్ని ఎవరైనా సాహసం చేసి ఆయనకు మేమిస్తామని తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు. లేదంటే, తనకిష్టమైన పప్పు కోసం స్వయంగా లోకేశ్‌నే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుంటే మాకెటువంటి అభ్యంతరం లేదు గనుక ఈ పప్పు మట్టి కుండను ఇక్కడ్నే ఉంచుతాము” అని మంత్రి ఘాటుగా బదులిచ్చారు.
“శంఖారావం ను ఆయన పలికినట్లు సంకారావం అని వంకరగా నేనైతే మాట్లాడలేను. ఎందుకంటే, నేను తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడ గలను. వాస్తవానికి అది అనకాపల్లి నియోజకవర్గ సమావేశమైనప్పటికీ, కార్యక్రమాన్ని మాత్రం యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లె ప్రాంతంలో నిర్వహించారు. ఈ విషయాన్ని ఈ లోకేశ్ మొద్దుకు తెలుసో లేదో నేను గుర్తుచేస్తున్నాను”
“నేను వందల ఎకరాల్ని దోచేశానని, రూ.వందల కోట్లు దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నావు. నేనేమీ లోకేష్ లా బ్యాక్‌డోర్ పొలిటీషియన్‌ను కాదు. నా తండ్రి చనిపోయిన తర్వాత దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పోరాడి.. మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి .. ప్రజల మన్ననల్ని సంపాదించి జగన్‌మోహన్‌రెడ్డి గారి దయ వలన శాసన సభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చొన్నాను. అదే తమరు ఎలా పదవుల్లోకొచ్చారు..? తమరు మంత్రి అయ్యాకనే ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోతారు. ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుగా.. నీ రాజకీయ చరిత్ర ఇది. అదే నేను.. 45 సంవత్సరాలుగా విశాఖపట్టణం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కొడుకుగా శాసనసభ్యునిగా గెలుపొందాకనే మంత్రినయ్యాను. జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమల శాఖకు మంత్రినయ్యాను. అసలు, నీకు సిగ్గుందా..? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువై ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి.. నువ్వొచ్చి మాలోంటోళ్ల గురించి మాట్లాడుతావా..? ఇదీ నీకూ-నాకూ ఉన్న తేడా అని గమనించుకో” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.