Monday, April 15, 2024
Homeతెలంగాణదండకారణ్యంలో ఆదివాసీ కుంభమేళా

దండకారణ్యంలో ఆదివాసీ కుంభమేళా

ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకి ఓసారి జరిగే ఆ జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి  నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరుగుతుంది. కుంభమేళా తర్వాత మేడారం జాతరకు దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రతీతి. దండకారణ్యంలో భాగమైన ములుగు – ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని మారుమూల ప్రాంతం మేడారం. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా తల్లి సమ్మక్క, కుమార్తె సారలమ్మ పాలకులతో చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తుంది.

13వ శతాబ్దంలో జరిగిన కథే సమ్మక్క- సారక్క జాతరకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతం దారుణమైన కరువుతో అల్లాడిపోయేది. కరువుకాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించకపోతారా అని – అక్కడి అడవులని పాలించే కోయరాజులు ఎదురుచూసేవారు. అలాంటి సమయంలో వారికి ఓ పాప కనిపించింది. చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తుండగా, ఆ పాప ఓ పుట్ట మీద పడుకుని కనిపించింది. ఆ పాప తమకోసం అవతరించిన దేవతే అనుకున్నారు కోయరాజులు. ఆ పాపకు సమ్మక్క అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆమె కాకతీయుల సామంత గిరిజన అధిపతి అయిన పగిడిద్ద రాజును వివాహం చేసుకుంది. ఆమెకు వరుసగా సారక్క, నాగులమ్మ మరియు జంపన్న అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం. ఇది ప్రతి రెండు సంవత్సరాలకు (ద్వైవార్షిక) జరుగుతుంది. లక్షల మంది ప్రజలు ఈ ప్రదేశానికి తరలివస్తారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి (M.P, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక మరియు జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు) అనేక మంది గిరిజన భక్తులు జాతరకు చేరుకుంటారు. ప్రజలు దేవతలకు తమ బరువుకు సమానమైన పరిమాణంలో బంగారం/బంగారం (బెల్లం) సమర్పించి, జంపన్న వాగులో (ప్రవాహం) పవిత్ర స్నానం చేస్తారు. ఇది వైదిక, బ్రాహ్మణ ప్రభావం లేని పండుగ.

గిరిజనులుగా పుట్టి వారి కోసమే పోరాడిన సమ్మక్క, సారలమ్మ ఆదివాసీలకు దేవతలు అయ్యారు. కాలక్రమంలో అందరికీ అమ్మలయ్యారు. మనుషులే దేవతలుగా మారిన వైనం జాతరకు కారణం. ఇక్కడ నమ్మకాలే పూజలు. ఆచారాలే ఆరాధనలు. దేవతలు గద్దెల పైకి రావడం ఓ ఉత్సవం. అమ్మలు వచ్చిన వేళ.. జాతరకు పూనకం పుడుతుంది. భక్తితో ఊగిపోతుంది. పారవశ్యంతో పొంగిపోతుంది. టన్నులకొద్దీ బంగారం (బెల్లం) మొక్కులు, రాసుల కొద్దీ కాసుల వర్షం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పండుగకు ముస్తాబైంది. పక్షం రోజుల ముందు నుంచే.. భక్తుల కోలాహలం మొదలైంది. నాలుగు రోజులపాటూ జరిగే జాతర తెలంగాణ సంస్కృతికి సిసలైన నిర్వచనం చెబుతుంది.

జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. సారలమ్మ గద్దె పైకి రాకముందే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) మేడారంలోని చిలుకలగుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక రాకతో మేడారం పులకించిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఉంటారు. ఇద్దరు అమ్మలున్న నాడు మేడారం భక్తులతో కిక్కిరిసిపోతుంది. నాలుగోరోజు సమ్మకను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

మేడారం జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. సమ్మక, సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక గద్దె, మరొకటి సారలమ్మ గద్దె. ప్రతి గద్దె మధ్యలో ఉండే చెట్టు కాండాలే (కంకమొదళ్లు) వన దేవతలు. దేవతామూర్తులను తోడొని వచ్చే వడ్డెలు (పూజారులు)… తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తుల నమ్మకం. సమ్మక్క కుమారుడి పేరుతో ఉన్న జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత గద్దెల దగ్గరికి పోయి అమ్మలను దర్శించుకుంటారు. చాలా మంది మగవాళ్లు అమ్మవారి రూపం(మహిళగా)లో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా కోళ్లను గాల్లోకి ఎగురవేయడం), లసిందేవమ్మ మొకు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి మొక్కులు ఇక్కడ ఉంటాయి.

సమ్మక-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు మొక్కుగా వారి బరువుకు సమానంగా బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. మేడారం జాతరలో బెల్లమే ప్రసాదం. కోటి మంది వరకు వచ్చే జాతర ప్రాంతం దుమ్ముధూళితో నిండిపోతుంది. ఆరోగ్య సమస్యలు… ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు రాకుండా బెల్లం పనిచేస్తుంది. అందుకే ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టారని గిరిజనులు చెబుతుంటారు. మేడారం జాతరలో కానుకల మొక్కుల సంప్రదాయం లేదు. మద్యం, మాంసం ఈ జాతరలో మమేకం. జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి, నియమాలు ఉండవు. త్యాగాల తల్లులను కొలిచే మేడారం జాతరకు ప్రతి మహిళా రావచ్చు. అంటు, ముట్టు అనే పదాలు ఇక్కడ చెల్లవు.

1998 వరకు మేడారం చేరుకోవడానికి ఎద్దుల బండి మాత్రమే మార్గం. 1998లో రాష్ట్ర ప్రభుత్వం 1000 ఏళ్ల నాటి పండుగను అధికారికంగా ప్రకటించింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్