Sunday, November 24, 2024
HomeTrending Newsసిఎం జగన్ మా బ్రాండ్ అంబాసిడర్: గుడివాడ

సిఎం జగన్ మా బ్రాండ్ అంబాసిడర్: గుడివాడ

విశాఖ పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయన్న సమాచారం అందిందని, 18 విమానాలను విశాఖ ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసే అవకాశం ఉందని, మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, కుమార్ మంగళం బిర్లా తదితరులు సదస్సుకు వస్తున్నారన్నారు. అందరికీ విశాఖ నగరంలోని వివిధ హోటల్స్ లో బస ఏర్పాటు చేశామని, 600 గదుల వరకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ఇప్పటివరకు సదస్సులో పాల్గొనేందుకు పదివేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని అమర్నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయని, ఇది రాష్ట్రంలో మేజర్ సెక్టర్ కాబోతోందని చెప్పారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. దేశంలో మరి ఎక్కడా లేనివిధంగా 70 శాతం మంది స్కిల్ ఫోర్స్ ఏపీలో ఉందన్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి భవిష్యత్తుగా నిలుస్తుందని అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి 8 గంటలకు విశాఖ చేరుకుంటారని, మూడవ తేదీ ఉదయం ఆయన వేదిక వద్దకు వచ్చి, ఎగ్జిబిషన్ తిలకిస్తారని వివరించారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం ప్రసంగిస్తారని, అదేరోజు కొన్ని ఎంవోయూలు జరుగుతాయని చెప్పారు. నాలుగవ తేదీన కూడా మరికొన్ని ఎంఓయూలు ఉంటాయన్నారు. సిఎం జగన్ పై విశ్వసనీయత, నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేకమంది ముందుకు వస్తున్నారని అన్నారు. చేసుకున్న ఎంవోయులలో 90 శాతం వరకు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందని విశ్వాసం వెలిబుచ్చారు.

ఇదిలా ఉండగా సదస్సుకు వచ్చే అతిధులకు స్థానిక ఎంజీఎం పార్కులో రెండవ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఇక్కడ లేజర్ షో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్