Sunday, November 3, 2024
HomeTrending Newsఆయిల్ ఫామ్ సాగుతో సిరులు

ఆయిల్ ఫామ్ సాగుతో సిరులు

వ్యవసాయం రోటీన్ ప్రక్రియ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే  రైతులు మారాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే అనుకూలంగా ఉండేవని, సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతంతో ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు అనుకూలంగా మారాయన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్ రావు. క్షీరసాగర్ లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీశ్ నాటారు. ఈ మేరకు ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పధ్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు.

ఆయిల్ ఫామ్ లాభసాటి పంట. 60 వేల కోట్ల పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసి మన దేశంలో వాడుకుంటున్నామన్న మంత్రి హరీష్ మనకు మనమే పామాయిల్ తోటలు పెడితే ఎగుమతి చేసేలా ఎదుగుతామన్నారు. పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. పామాయిల్ సాగుకు అవసరమైన వనరులన్నీ సబ్సిడీ రూపంలో పెట్టుబడిగా ప్రభుత్వమే సాయం చేస్తుందని మంత్రి వెల్లడించారు.

పామాయిల్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ కోసం హెక్టారుకు 43 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, కేవలం రూ.4300 రైతు చెల్లించాల్సి ఉంటుందని, మిగతా 39 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లింపు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ఒక్క ఎకరానికి 1 లక్షా 20 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నదని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు మంత్రి సూచించారు.

సిద్ధిపేట జిల్లా రైతులను ఆయిల్ ఫామ్ సాగులో ముందుకు తీసుకుపోవాలన్నదే తన కోరికని మంత్రి తెలిపారు.  దేశ వ్యాప్తంగా 8 లక్షల 25 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతోందని, దేశ అవసరాలకు 70 లక్షల ఎకరాల్లో  పామాయిల్ సాగు చేయాలని, ఆ దిశగా సాగు చేస్తే విదేశాల నుంచి దిగుమతి నిలిచిపోతుందన్నారు. ఇదంతా గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల 25 వేల ఎకరాలు పెట్టాలని నిర్ణయించినట్లు, సిద్ధిపేట జిల్లాలో 50 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి సన్నాహాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.

పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉంది. అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, హార్టి కల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్