ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. ప్రతిపక్షంతో పాటు కొంతమంది మేధావులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్ ను నియంత్రించేందుకు ఆన్ లైన్ లో టిక్కెట్లను విక్రయించాలని సినిమా రంగానికి చెందిన పెద్దలే ప్రభుత్వాన్ని కోరారని, నిర్ణయించిన ధరలకు టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచుతామని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడే థియేటర్లలో షోలు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమా టిక్కెట్లు ఉండాలని, ప్రజలకు వినోదాన్ని సరసమైన ధరలకే అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని నాని చెప్పారు. ఆన్ లైన్ టికెట్ విధానం నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్.డి.సి.)కి అప్పగించామని, దానికి సాంకేతిక సహకారం అందించే బాధ్యతను ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. దీన్ని వక్రీకరించి ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముతుందంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తెలివితేటలు ఎక్కువగా ఉన్న మేథోబలులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యంగా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఆన్ టికెటింగ్ విధానం ఇంకా చర్చల దశలోనే వుందని, ఈ అంశాన్ని అతి త్వరలో పరిష్కరిస్తామని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని నాని హామీ ఇచ్చారు.
ఎవరి మెప్పుకోసం కొంతమంది మేధావులు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. ప్రతిదానికీ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ లు ఎగ్గొట్టకుండా, ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోకుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని నాని వివరించారు.