మోసపూరిత మేనిఫెస్టోలతోనే చంద్రబాబు గతంలో సిఎం అయ్యారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఆరోపించారు. బాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టోను బుద్ధి ఉన్నవారు ఎవరూ నమ్మబోరని… బాబు చెప్పింది మేనిఫెస్టో కాదని, మాయఫెస్టో, మోసఫెస్టో అంటూ విమర్శించారు. ఆయన ఇప్పటికే మూడు సార్లు, 14 ఏళ్ళపాటు సిఎంగా పని చేశారని… ఆ కాలంలో ఆయన చెప్పిన నెరవేర్చలేకపోయిన విషయం ప్రజలకు తెలుసన్నారు. పలాస ప్రగతి భవన్ లో మంత్రి సీదిరి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో వందల సంఖ్యల్లో హామీలిచ్చి పదుల సంఖ్యలో కూడా నేరవేర్చలేకపోయారని విమర్శించారు. కానీ వంద శాతం హామీలు నెరవేర్చిన ఘనత సిఎం జగన్ కు దక్కుతుందన్నారు.
కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన పార్టీ తన హామీలను నెరవేర్చడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తున్నామని, కానీ జగన్ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను చిన్న ఇబ్బంది కూడా లేకుండా అమలు చేయడం గొప్ప విషయమన్నారు. తమ ప్రభుత్వం నెలకొల్పిన వాలంటీర్ల వ్యవస్థ వల్లే శాచురేషన్ పద్దతిలో సంక్షేమ ఫలాలు అందించడం సాధ్య పడిందన్నారు. అన్ని అర్హతలు ఉండి సంక్షేమం అందని వారు వెయ్యికి ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారని, వీరికి చాలా ఆవేదన ఉంటుందని, గడప గడపకూ మన ప్రభుత్వంలో కొన్ని సంఘటనలు తాము చూశామని చెప్పారు. ఇలాంటి వారికి కూడా జల్లెడ పట్టి మరీ ఆయా పథకాలు అందించేందుకే జగనన్న సురక్షా కార్యక్రమాన్ని రేపటినుంచి చేపడుతున్నామని వెల్లడించారు.
బాబు ఇచ్చిన హామీలు నీటిమీద రాతలేనని, తాము ఇస్తున్న పథకాలకే పేర్లు మార్చి ఇస్తామని చెప్పడానికి సిగ్గుండాలని ఘాటుగా మండిపడ్డారు. బాబు సిఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంపద సృష్టించకుండా కుటుంబానికి మాత్రం జనరేట్ చేసుకున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం వృద్ధి రేటు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని… పెట్టుబడులు, ఎగుమతుల్లో మూడో స్థానంలో నిలిచామని వివరించారు.