క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం బాధ్యత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ)దేనని, క్రీడాభిమానులకు టిక్కెట్లు పారదర్శకంగా విక్రయించడంలో హెచ్ సి ఏ పూర్తిగా వైఫల్యం చెందిదని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతోందని, అందుకే టిక్కెట్లకు ఈ స్థాయిలో డిమాండ్ ఉందని, కానీ దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో సంస్థ విఫలమైందని ఆరోపించారు. ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టిక్కెట్ విక్రయ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో HCA పై అత్యససర సమీక్షా సమావేశం నిర్వహించారు. HCA అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
సమావేశం తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తాము అడిగిన తర్వాతే టిక్కెట్ల అమ్మకం ప్రారంభించారని, ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తగిన పోలీసు భద్రత కల్పించి ఉండేవాళ్లమని అన్నారు. తెలంగాణ ప్రతిష్ట దిగజారుస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హెచ్ సి ఏ రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దుతామంటే ఒప్పుకోమన్నారు. తొక్కిసలాటపై కమిటీ వేశామని, దాని నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : T20 Match: టిక్కెట్ల కోసం తొక్కిసలాట