ప్రతిపక్ష పార్టీల నేతల నోటికి హద్దు లేదని, ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఈ రోజు విజయ ఐస్ క్రీమ్ నూతన పుష్ కార్ట్ లను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 50 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు పుష్ కార్ట్ లను అందజేసి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి తలసాని. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి ఎంపిలు బాధ్యతగా మాట్లాడాలని తలసాని హితవు పలికారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెరాస నేతలు కేంద్రం వారి ధాన్యం కొనుగోలు చేయాలని పోరాటం చేస్తున్నామన్నారు.
గవర్నర్ తమిలి సై బాధ్యతతో మాట్లాడాలని, గవర్నర్ కు రాజకీయాలు అవసరం లేదని మంత్రి తలసాని అన్నారు. గవర్నర్ మీడియాతో ఎలా మాట్లాడుతారని, గవర్నర్ పరిధి ఎంటో తెలుసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసి వచ్చాక మీడియా తో మాట్లాడే అవసరం ఏం ఉందన్నారు. దేశంలో అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని, నాడు ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని తలసాని గుర్తు చేశారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడలేను అని చాలాసార్లు చెప్పారని, అది ఆయన హుందా తనమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఉండడం దురదృష్టకరమని, ధాన్యం ఎందుకు కొనరో ఈ బీజేపీ నాయకులు చెప్పాలని మంత్రి తలసాని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నూకలు తినాలని అంటాడా. ఇదేనా ఆయన మాట్లాడే తీరని విమర్శించారు. 24 గంటల విద్యుత్ సరఫరా మన రాష్ట్రంలో ఉందని, బిజెపి వాళ్లు పాలించే రాష్ట్రాల్లో లేదు అందుకే వాళ్లకు ఈర్ష్య అని తలసాని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను పని చేయనీయాలి కానీ వ్యవస్థను పక్కదారి పట్టించవద్దన్నారు.
డ్రగ్స్ నివారణపై తెలంగాణ ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తోందని, పబ్ లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో తీద్దామా అని విపక్ష నేతలకు మంత్రి సవాల్ విసిరారు. గుజరాత్ లో మద్య నిషేధం ఉన్నా…విచ్చల విడిగా మద్యం దొరుకుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Also Read : ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి