Thursday, May 9, 2024
HomeTrending Newsప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి

ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి

Governor Tamilsai Dissatisfied :

తెలంగాణ ప్రభుత్వం తన పట్ల వివక్ష చూపిస్తోందని, మహిళా గవర్నర్ను అవమానిస్తున్నారని గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో రాజకీయ పరిణామాలు, టీకా పంపిణి తదితర అంశాలపై ప్రధానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. ప్రధానితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన గవర్నర్ వ్యక్తిగతంగా తనను అవమానించిన భరిస్తానని, రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించానని, ప్రజలకు చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశానని గవర్నర్ వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలని, వరంగల్ ఆస్పత్రి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది తన విచక్షణాధికారమని, కౌశిక్ రెడ్డి పేరు సిఫారసు పైన నేను సంతృప్తి చెందలేదన్నారు. గతంలో ఇద్దరూ పేర్లను ఆమోదించారు, నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

సీఎం కెసిఆర్ ఏ విషయం పైన అయినా తనతో నేరుగా వచ్చి చర్చించవచ్చని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రధానితో జరిగిన సమావేశంలో కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేసానని తెలిపారు. గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి అందరికీ తెలుసు అన్న గవర్నర్ తను వివాదాస్పద వ్యక్తిని కాదని, అందరితో స్నేహంగా ఉంటానన్నారు. తను చాలా పారదర్శకంగా ఉంటానని, ప్రజలతో, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటానని వివరించారు. తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలన్నారు.  గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలన్నారు.

కౌశిక్ రెడ్డి వ్యవహారంలో… అభ్యర్థిత్వం మీద తను సంతృప్తి చెందలేదని గవర్నర్ తెగేసి చెప్పారు.  గతంలో ముగ్గురి విషయంలో ఆమోదం తెలిపాను, నేనేమీ వివాదాస్పదం చేయలేదు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఏవో కారణాలు సాకు చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదని, అధికారులను సైతం హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకూడదు. గవర్నర్ గా ఎవరున్నా.. ఆ పదవిని గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం నా పని కాదని, నేను ఒక డాక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో కోరాను. విజ్ఞప్తి చేసాను. అంతే అన్నారు. ఉగాది సందర్భంలో కూడా ఆహ్వానాలు పంపాను. నేను ఎవరినీ ఇగ్నోర్ చేయలేదు. నాకు ఈగో లేదని స్పష్టం చేశారు. మెచ్చుకునే సందర్భాల్లో మెచ్చుకున్నా. లోపాల గురించి కూడా మాట్లాడాను. కొన్ని సూచనలు చేశానని గవర్నర్ తమిలి సై పేర్కొన్నారు.

Also Read : ఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

RELATED ARTICLES

Most Popular

న్యూస్