అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ రోజు (గురువారం) ఉదయం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని VST వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకున్న గోదాంను మంత్రి శ్రీనివాస్ యాదవ్ MLA ముఠా గోపాల్ తో కలిసి పరిశీలించి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో అనేక చోట్ల ఉన్న గోదాములు, ఇతర భవనాల నిర్వహకులు, వ్యాపారులు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగానే తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.

ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ఇటీవలనే మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు సకాలంలో స్పందిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. అధికారులు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకొని చర్యలకు సిద్దం అవుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *