ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది సిఎం జగన్ ఆలోచన అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులపై గత ప్రభుత్వం అప్పుల భారం మోపిందని ఆరోపించారు. నెల్లూరు నగరం, భగత్‌సింగ్ నగర్‌లో టిడ్కో ఇళ్లను మంత్రి అనిల్ కుమార్ తో కలిసి ప్రారంభించి వెయ్యి మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 44 వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, ధనవంతులు నివసించే కాలనీలకు దీటుగా ఇళ్ళ సముదాయాలు ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలోనే ఉన్నామని బొత్స వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని, 18 నెలల్లో అందరికీ అందిస్తామని బొత్స చెప్పారు. సిఎం వైయస్ జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ పాలనా దక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమని, ప్రతివారం హోసింగ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారని బొత్స అన్నారు
మంత్రి అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకొని మోసం చేసిందని చెప్పారు. పేదలపై భారం పడకూడదనే రూ.7 వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని వివరించారు. భగత్ సింగ్ నగర్ లో మరో నెలరోజుల్లో 4,800 ఇళ్ళను సిద్ధం చేసి లబ్దిదారులకు అందిస్తామని అనిల్ హామీ ఇచ్చారు.