Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్విజయం దదాతి వినయం

విజయం దదాతి వినయం

బరువులెత్తి భారత దేశం పరువు నిలిపిన మీరాబాయ్ చాను గురించి ఇప్పుడు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలవడానికి ముందు ఆమె ఎన్నో కష్టాలను మోసింది. కన్నీళ్లను ఈదింది. ముళ్లదారుల్లో అలుపులేకుండా నడిచింది. పేదరికంతో యుద్ధం చేసింది. వాగులు వంకలు, కొండలు కోనలు దాటింది.

వెయిట్ లిఫ్టింగ్ శిక్షణలో ఉన్నప్పుడు తన ఇంటినుండి ఇంఫాల్ లో కోచింగ్ సెంటర్ కు ఇరవై కిలోమీటర్ల దూరం. రాను పోను టికెట్ కొని బస్సులో వెళ్లే స్థోమత లేదు. ఆ దారిలో లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వారు ఉచితంగా తీసుకెళతారు. అలా ఏళ్లతరబడి లారీల్లో ఉచితంగా కోచింగ్ కు వెళ్లి వచ్చింది.

ఒలింపిక్స్ లో బరువయిన పతకాన్ని గెలిచింది. దేశం పొంగిపోయింది. సొంత ఊరికి వచ్చిన మీరా తనకు గతంలో లిఫ్ట్ ఇచ్చిన లారీ డ్రైవర్లందరినీ వెతికి పట్టుకుని…ఇంటికి పిలిచి ఆప్యాయంగా పలకరించింది. వారందరితో కలిసి భోంచేసింది. పేరు పేరునా అందరికీ రెండు చేతులు జోడించి, తలవంచి, నమస్కరించింది. 150 మంది డ్రైవర్లతో జరిగిన ఈ కృతజ్ఞతా పూర్వక ఆత్మీయ సమ్మేళనం మాటలు వర్ణించలేనంత మధురమయినది. విజయం నేర్పిన వినయానిది.

మీరా మనసు బంగారం అని మీడియా కీర్తిస్తోంది. ఆ ప్రశంసలకు ఆమె అక్షరాలా అర్హురాలు.

మనసు పొంగిపోయే వార్త ఇది. ఒళ్లు పులకించే వార్త ఇది. చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన వార్త ఇది. వినయ సంపదకు స్ఫూర్తి నింపిన వార్త ఇది.

గెలిస్తే ప్రపంచం పాదాక్రాంతమవుతుంది. కానీ మీరా గెలిచి తన పాదాలకు బలాన్నిచ్చిన వారిని వెతికి వారి ముందు చేతులు జోడించి, నిలుచుంది. ఇప్పుడు టోక్యో పతకం మీరా ముందు చిన్నగా కనిపిస్తోంది. నూటికో కోటికో ఒక్కరు…ఎక్కడో ఎప్పుడో పుడతారు…

RELATED ARTICLES

Most Popular

న్యూస్