టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు మొదటి పతకం లభించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన మీరాబాయి చాను రజత పతకం సాధించారు. చైనా లిఫ్టర్ జీహు స్వర్ణ పతకం, ఇండోనేషియా కు చెందిన విండి కాంటికా కాంస్య పతకం సాధించారు. జీహు మొత్తం 210 కిలోలు లిఫ్ట్ చేసి రికార్డు సృష్టించారు. మీరాబాయి 202, కాంటికా 194 కిలోలు లిఫ్ట్ చేశారు.
ఇండియా తరఫున వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్స్ పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి చరిత్రకెక్కారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి 69 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పని చేస్తున్నారు.
మళ్ళీ 21 ఏళ్ళ తరువాత ఇప్పుడు మణిపూర్ ముద్దు బిడ్డ 26 సంవత్సరాల మీరాబాయి సిల్వర్ మెడల్ సంపాదించి భారత్ ప్రతిష్ఠను నిలబెట్టారు. 2020లో తాష్కెంట్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం, 2017 లో అనాహీం లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో బంగారు పతకం సాధించారు.
1994 ఆగస్టు 8 న మణిపూర్ లో జన్మించిన మీరాబాయ్ చాను 12 ఏళ్ళ వయస్సులో వెయిట్ లిఫ్టింగ్ ను అనుకోకుండా ఎంచుకుంది. పేద కుటుంబం లో పుట్టిన ఆమె… తన పెద్దన్నయ్య మోయడానికి నానా కష్టాలు పడే ఎండు కట్టెల మోపును అవలీలగా అడవి నుంచి ఇంటికి మోసుకుని తెచ్చేదట చిన్నప్పుడు. ఆ విధంగా ఈ స్పోర్ట్స్ ను ఎంచుకుని రాణిస్తోంది. మట్టిలో మాణిక్యాలు టోక్యోలో ప్రతిభ కనబరచబోతున్నాయి.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర నేతలు మీరాబాయికి శుభాకాంక్షలు తెలియజేశారు.