గుజరాత్ లో జరుగుతోన్న నేషనల్ గేమ్స్ లో మణిపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్ సిల్వర్ తో పాటు, రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ లో విజేతగా నిలిచిన మీరాబాయి మరోసారి సత్తా చాటింది.
స్నాచ్ కేటగిరిలో 84 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో 107 కిలోలు కలిపి మొత్తం 191 కిలోలు లిఫ్ట్ చేసింది. సంజిత చాను 187 కిలోలతో రజత పతకం (82+105); ఓడిశాకు చెందిన స్నేహ సోరెన్ 169కిలోలతో(73+96) కాంస్య పతకం సంపాదించారు. ముంజేతి గాయంతో బాధపడుతున్నా మొక్కవోని ధైర్యంతో మీరాబాయి బంగారు పతకం గెల్చుకుంది.
డిసెంబర్ లో వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఉన్న తరుణంలో ఈ గోల్డ్ మెడల్ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని మీరాబాయి చెప్పింది. మణిపూర్ కు తరఫున ఆడడం, అందునా సొంత రాష్ట్రం నుంచి వచ్చిన క్రీడాకారుల తరఫున ప్రారంభ వేడుకకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడించింది.