చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్రమంత్రిని ఎమ్మెల్యే చెవిరెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఈ భేటిలో పాల్గొన్నారు.
తిరుపతి స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా . చంద్రగిరి రైల్వే స్టేషన్ తీర్చిదిద్దవచ్చని చెవిరెడ్డి విన్నవించారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉందని, అభివృద్ధికి స్థలాభావం సమస్యాత్మకంగా పరిణమించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్లాట్ ఫాంలు యాత్రికుల రద్దీకి అనుకూలంగా లేవన్నారు. రేణిగుంట సిఆర్ఎస్ వద్ద ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా భవిష్యత్తులో తిరిగి సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చంద్రగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం ద్వారా శతాబ్దాల కాలానికి పైగా యాత్రికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రగిరి రైల్వేస్టేషన్ కు అతి సమీపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్నారు. తిరుమలకు వచ్చే 50 శాతం పైగా యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శనార్థం విచ్చేస్తున్నారని తెలిపారు. శ్రీవారు లక్ష్మీదేవితో వివాహం తరువాత ఈ ఆలయంలో కొలువుదీరినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు, ప్రయాణీకులు శ్రీనివాసమంగాపురం, తిరుమలకు చేరుకునేందుకు చంద్రగిరి రైల్వే స్టేషన్ చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి మెట్టు మార్గం చంద్రగిరి రైల్వే స్టేషన్ కు 4 కిలో మీటర్లు దూరంలో ఉందన్నారు. నీరు, విద్యుత్, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. తిరుపతికి సమీపంలో ఉండటంతో చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. చంద్రగిరి లో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు