Saturday, July 27, 2024
Homeతెలంగాణభూములు కొనొద్దు : భట్టి హెచ్చరిక

భూములు కొనొద్దు : భట్టి హెచ్చరిక

ప్రభుత్వం అమ్మకానికి తలపెట్టిన భూముల కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఒకవేళ ఇప్పుడు భూములు కొన్నా, 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మళ్ళీ వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భవిష్యత్ అవసరాల కోసం ఆస్తుల రూపంలో భూములు ఉన్నాయని, అమ్మకానికి కాదని స్పష్టం చేశారు. మల్లు భట్టి అధ్యక్షతన సిఎల్పీ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గతంలో కరోనా సమయంలో ఆస్పత్రుల సందర్శన కార్యక్రమం నిర్వహించినట్లే ఇప్పుడు భూముల అమ్మకంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల అమ్మకం సరికాదంటూ, నాడు భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన టిఆర్ఎస్ ఇప్పుడు భూముల అమ్మకానికి సిద్ధపడడం దారుణమన్నారు మల్లు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందీ, తెలంగాణ వచ్చింది ఆస్తులు కాపాడటం కోసమే తప్ప భూములు అమ్ముకోవడానికి కాదని భట్టి అన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల నెత్తిన విపరీతమైన భారం పడిందని, రాబోయే రెండేళ్లలో ఈ అప్పులతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో గవర్నర్ ని కలిసి భూముల అమ్మకాలు నిలిపి వేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అమ్మకానికి పెట్టిన భూములను సందర్శిస్తామని వెల్లడించారు.

అప్పుల వివరాలు, అమ్మకానికి పెట్టిన భూముల వివరాలు ప్రజల ముందుంచాలని భట్టి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల అమ్మకంపై పునరాలోచన చేయాలని, మొండిగా ముందుకెళ్తే వేలం ప్రక్రియను అడ్డుకుంటామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్