ఇవాళ రాయలసీమలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగసభతో నారాసుర వధకు సిద్ధం జరగబోతోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు నేటి రాప్తాడు సభకు రాయలసీమ 52 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, గృహ సారధులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారని అన్నారు. భీమిలి, దెందులూరు సభలతో టీడీపీ, చంద్రబాబుకు బుర్ర పని చేయటం లేదనిమ్, సీఎం జగన్ జన ప్రభంజనంతో దూసుకు వెళ్తుండటంతో చంద్రబాబు ఖాళీ కుర్చీలతో పరాభవం చెందుతున్నాడని ఎద్దేవా చేశారు. డబ్బులు, మందుబాటిళ్లు, బిర్యానీలు, వాహనాలు ఏర్పాటు చేసి తీసుకు వస్తున్న జనాలను ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక.. ఆ ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు, లోకేశ్‌లు నోటికి పనిచెబుతున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“లోకేష్ విశాఖలో సెల్ఫీ దిగాడు. అమరావతిలో ఎక్కడైనా సెల్ఫీ దిగే అవకాశం ఉంటే చెప్పండి. జగన్ మోహన్ రెడ్డి రుషికొండ మీద ప్రభుత్వ భవన నిర్మాణం చేశాడు. అది ప్రజల ఆస్తి. ప్రజల కట్టడం. అక్కడ సెల్ఫీ దిగి.. ప్రజలకు అంకితం ఇస్తానని అంటాడు. మీ మైండ్‌లు పోయాయని అంటే ఏడుస్తారు. మమ్మల్ని ఎలా అంటే అలా అనిపిస్తున్నారని అంటారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా రుషికొండ బిల్డింగ్ దగ్గర సెల్ఫీ దిగి.. జాతికి అంకితం ఇస్తానంటే ఏమి చెప్పాలి. గతంలో పవన్ కల్యాణ్ వెళ్లాడు. అది ప్రభుత్వ భవనం. కరకట్ట మీద లాంటి దొంగ నిర్మాణాలు కాదు” అంటూ ధ్వజమెత్తారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక యుద్ధాన్ని చేయాలని సంకల్పించినప్పుడు తన సైన్యం ఎలాంటి శక్తియుక్తులు కలిగి ఉండాలో వ్యూహరచనలో భాగంగా కొన్నిచోట్ల మార్పులు, చేర్పులు చేస్తున్నారని… అది ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగతంగా చేసుకునే పనేనని స్పష్టం చేశారు. నిన్నటి ఇంకొల్లు సభలో నన్ను, ఎంపీ నందిగం సురేష్‌ను, కరణం బలరాం కృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్‌ను తిట్టారని తాము ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా స్వయంకృషితో వైఎస్‌ఆర్, వైఎస్ఆర్‌సీపీ దయతో ఎదిగామని, కేవలం మమ్మల్ని క్రియాశీల కార్యకర్తలుగా… కష్టపడే మనస్తత్వం ఉన్నవారిగా… దళిత జాతిలో పుట్టిన మాకు నాయకత్వం చేయగల సమర్థత ఉందని మాకు రాజకీయ పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. మళ్లీ ఈరాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, 2024-29 వరకు పరిపాలించబోయేది ఆయనేనని సుధాకర్ బాబు ధీమావ్యక్తం చేశారు.