కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. సిఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసే దిశగా కుట్రలు మొదలయ్యాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావటం అంటున్నారు. ఈ వ్యవహారం పార్టీలో కొత్త పరిణామాలకు దారితీస్తోంది. నియోజకవర్గంలో జరిగే అంశాలు తనతో చర్చించకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలోకి తీసుకోవటంపై సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు. జీవన్ రెడ్డిని ఓదార్చే పనికి మంత్రులు, సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.
జీవన్ రెడ్డి అసంతృప్తి అలా ఉండగా.. దీని వెనుక పెద్ద వ్యవహారమే జరుగుతోందని రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వియ్యంకుడు రమేష్ రావు కంట్రాక్టర్. మహబూబ్ నగర్ కు చెందిన రమేష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొంగులేటి చొరవతోనే సంజయ్ కుమార్ రాకకు మార్గం సుగమం అయిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
సంజయ్ కుమార్ ను తీసుకు వచ్చే క్రమంలో స్థానిక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాట మాత్రంగా చెప్పకుండా తతంగం నడిపించటం పార్టీలో చిచ్చురేపుతోంది. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ అప్పట్లో జీవన్ రెడ్డికి పలుమార్లు రాయబారం పంపారు. ఆ ప్రతిపాదనను జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అలా కాంగ్రెస్ నమ్మిన బంటుగా పార్టీలో కొనసాగుతున్నారు. తాజా పరిణామాలతో మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజానామా చేస్తానని ప్రకటించారు.
జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే సమయంలో సిఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష పార్టీని రాజకీయంగా దెబ్బతీసే క్రమంలో స్వపక్షంలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయని అంటున్నారు. అధిష్టానం వద్ద రేవంత్ పలుకుబడికి డోకా లేకున్నా రాష్ట్ర స్థాయిలో ఆయనను కిందకు లాగేందుకు స్వపక్షంలోనే కొందరు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. బీఆర్ఎస్ ను దెబ్బతీసే పేరుతో వేసిన ఎత్తుగడ పుణ్యమా అని పార్టీలో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయిని అంటున్నారు.
40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నవారికి పొగపెట్టడం ఒకవైపు… సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా జరుగుతున్న కుతంత్రాలు పార్టీకి నష్టం చేకురుస్తాయని హస్తం నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు సఖ్యతగా ఉన్నట్టే నటిస్తూ రేవంత్ రెడ్డికి పొగ పెడుతున్నారని, కాంగ్రెస్ మార్క్ పాలిట్రిక్స్ మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జీవన్ రెడ్డి వ్యవహారంలో అధిష్టానం చొరవ తీసుకుని సరిదిద్దకపోతే నష్టపోయే ప్రమాదముందని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
-దేశవేని భాస్కర్