Friday, November 22, 2024
Homeతెలంగాణమెదక్ పై కవిత కన్ను... హరీష్ రావు అసంతృప్తి..?

మెదక్ పై కవిత కన్ను… హరీష్ రావు అసంతృప్తి..?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గులాబీ అధినేత కెసిఆర్ కుటుంబంలో కొత్త సమస్య మొదలైంది. మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని వినికిడి. కవిత పోటీ చేయటాన్ని హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని… కెసిఆర్ కూడా ఆసక్తి చూపటం లేదని విశ్వసనీయ సమాచారం.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత… ఎన్నికల సమయంలో లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జైలుకు వెళ్ళక తప్పదని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈడి విచారణ ఎదుర్కొనేందుకే ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉండటం కన్నా ఎంపిగా ఢిల్లీ స్థాయి పరిచయాలు కేసు నుంచి బయట పడేందుకు ఉపయోగపడతాయని కవిత ఆలోచనగా ఉందని సన్నిహితులు అనుకుంటున్నారు.

మద్యం కుంభకోణం ఆరోపణలతో కవిత నిజామాబాద్ వైపు చూడలేని పరిస్థితి ఎదురైంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి సెగలు ఇంకా చల్లారలేదు. ఈ తరుణంలో మెదక్ సుస్థిర స్థానం అని ఆమె భావనగా ఉంది. తాజా పరిణామాలు పరిశీలిస్తే అసలు గులాబీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని పార్టీ నేతల్లో గుసగుసలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఖచ్చితంగా గెలవగలిగే స్థానం అంటూ ఇప్పుడు ఒకటి కూడా లేదని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. కెసిఆర్ నల్గొండ సభ ప్రభావం పేలవంగా ఉందని… అసెంబ్లీ సమావేశాల్లో కేటిఆర్ పనితీరు ప్రజలను ఆకట్టుకోలేదని వార్తలు వచ్చాయి. మంత్రి హరీష్ రావు ధాటిగా మాట్లాడినా… సాగునీటి రంగంపై ఎమ్మెల్యేలు ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మందుల సామేలు ప్రశ్నలకు జవాబు ఇచ్చే గులాబీ నేత కరువయ్యాడని పార్టీ నేతలే అంటున్నారు.

ఇలా బీఆర్ఎస్ పరపతి ప్రజల్లో పలుచన అవుతుంటే… ఈ తరుణంలో కవిత మెదక్ లో పోటీ చేస్తే కాంగ్రెస్ పంట పండినట్టే అని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. మెదక్ లో కెసిఆర్ మినహా ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ ను ఎదుర్కోవటం సాధ్యం కాదని అనుకుంటున్నారు. కెసిఆర్ ఎంపిగా పోటీ చేస్తే సిఎం రేవంత్ రెడ్డికి ముఖం చూపలేక పారిపోయాడనే అపవాదు వచ్చే అవకాశం ఉంది.

కవిత మెదక్ వస్తే కంట్లో నలుసులా తయారవుతుందని… తన అంచనాలు తారుమారై కవిత వచ్చినా… ప్రత్యర్థి గెలుపునకు హరీష్ రావు సహకరిస్తారని బీఆర్ఎస్ లో ఓ వర్గం అనుకుంటోంది. పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్న ఈ సమయంలో అగ్రనేతల మధ్య విభేదాలు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్