Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయంత్రోపన్యాసం

యంత్రోపన్యాసం

Prompter Problem:  రాజకీయాల్లో లీడర్లు, స్టేట్స్ మెన్ అని రెండు రకాలుంటారు. లీడర్- నాయకుడు. స్టేట్స్ మ్యాన్- రాజనీతిజ్ఞుడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇంకా చాలా రకాలు ఉంటారు. అవి ఇక్కడ అనవసరం. తళతళలాడే, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన పెళ పెళలాడే వైట్ అండ్ వైట్ డ్రస్ వేసిన ఎవరయినా లీడర్ కావచ్చు. స్టేట్స్ మెన్ కావడానికి ఇతర అర్హతలు చాలా ఉండాలి. నిరంతర అధ్యయనం ఉండాలి. ప్రాపంచిక దృక్పథం ఉండాలి. అనేకవిషయాల మీద లోతయిన అవగాహన ఉండాలి. అతి సంక్లిష్టమయిన విషయాలను అత్యంత సరళంగా విడమరచి చెప్పగలిగే నేర్పు ఉండాలి. అన్నిటికీ మించి ఆగని ప్రవాహంలా సాగిపోయే వాక్కు ఉండాలి. ఆ మాటలు ముత్యాల్లా కూర్చినట్లు ఉండాలి. మాటే మంత్రమై కట్టిపడేయాలి. ఆ మాటలను జనం పదే పదే మననం చేసుకోవాలి. వాక్కుకు వశమయ్యేవారు కొందరు. వాక్కును వశం చేసుకునేవారు కొందరు. వాక్కు జోలికే వెళ్లనివారు కొందరు.

రాజకీయనాయకులకు ప్రతి మాటకు లెక్క ఉంటుంది. మాట తూలితే మహా ప్రమాదం. కానీ…అడుగడుగునా మాట్లాడుతూనే ఉండాలి. దాంతో చాలా మంది రాసిన స్క్రిప్ట్ ముందు పెట్టుకుని మాట్లాడ్డానికే ఇష్టపడతారు. అలవోకగా, కవితాత్మకంగా, భావగర్భితంగా మాట్లాడే అటల్ బిహారీ వాజపేయి లాంటివారి ఉపన్యాసాలు వినడం ఎవరికయినా కర్ణామృతం. కానీ…ఈ ఉపన్యాస కళ అందరికీ అబ్బదు. రాజకీయాల్లో ఒక స్థాయికి రావడానికంటే ముందే…అంటే ఏ ముప్పయ్ ఏళ్లలోపే విపరీతంగా చదవాలి. మాతృభాషలో సహజమయిన ఉచ్ఛారణ, సామెతలు, నుడికారాలు, బాగా ప్రచారంలో ఉన్న కొటేషన్లు, పద్యాలు, పాటలు, డైలాగులు తెలిసి ఉండాలి. వాటిని సందర్భానికి తగినట్లు అప్పటికప్పుడు ఒడుపుగా ఉపయోగించగలగాలి. ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా…ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించాలి.

చాలా ఫార్మల్ గా జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో చాలా వరకు దేశాధినేతల ఉపన్యాసాలకు స్క్రిప్ట్ ముందే తయారై ఉంటుంది. కాగితాలు తిప్పుతూ చదివితే…స్కూల్ పిల్లలు చదివినట్లు ఉంటుంది కాబట్టి…మాట్లాడేవారి ముందు సీ త్రూ టెలి ప్రాంప్టర్లు పెడుతున్నారు. రెండు గాజు పలకల్లాంటివి స్టాండ్ మీద అటు ఇటు ఉంటాయి. పక్కనెవరో సిస్టం మీద టెక్స్ట్ ను రోల్ చేస్తూ ఉంటారు. కెమెరాల్లో క్లోజ్ ఫ్రేమ్ పెడతారు కాబట్టి టీ వీ ల్లో చూసే మనకు వారు కాగితం చూడకుండా మాటాడుతున్నట్లు అనిపిస్తుంది. స్టూడియోల్లో న్యూస్ రీడర్ల ముందు కూడా టెలి ప్రాంప్టర్ ఉంటుంది. స్టూడియోల్లో వాడే వాటికంటే దేశాధ్యక్షులు, ప్రధానులు వాడే పరికరాలు సాంకేతికంగా ఇంకా మెరుగయినవి అయి ఉంటాయి. అయితే…ఎంతయినా యంత్రం యంత్రమే.

మొన్న దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సును ఉద్దేశించి మన ప్రధాని మోడీ వర్చువల్ గా మాట్లాడారు. ఆ సందర్భంగా టెలి ప్రాంప్టర్ సరిగ్గా పనిచేయక…మధ్యలో చెవిలో మైకును తీసేసి, సొంతంగా మాట్లాడి ముగించారు. “ప్రాంప్టర్ ప్రధాని” అంటూ ఎగతాళిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆ ప్రహసనం వీడియోను షేర్ చేశారు. దావోస్ వారి తప్పే తప్ప…అది తమ తప్పు కాదని బి జె పి వివరణ ఇచ్చుకుంది.

ఏ మాటకామాట. రాహుల్ ఉపన్యాస కళతో పోలిస్తే మోడీ కొన్ని కోట్ల రెట్లు నయం. యంత్రం పాడయితే కంగారు పడకుండా మోడీ మేనేజ్ చేశారంటే…ఆ ఉపన్యాసం ప్రతిని ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా చదివే ఉండాలి.

రాజకీయ నాయకులు టెలి యంత్రాలను నమ్ముకుని ఉపన్యాసాలు మొదలు పెడితే…కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని ప్రధాని ప్రాంప్టర్ ప్రహసనం మరోమారు రుజువు చేసింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నిరీక్షణ రామాయణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్