Thursday, April 18, 2024
HomeTrending Newsవన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

Airports in all districts: వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు అనేది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు…

⦿ బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలి
⦿ ప్రస్తుతం ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
⦿ విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలి
⦿ నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టండి
⦿ దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయండి
⦿ నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కావాలి
⦿ గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
⦿ రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలి

సీ పోర్టుల పైనా సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్‌ల పనుల ప్రగతిపై సీఎంకు  అధికారులు వివరాలు అందించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని పనులు వేగవంతం చేయాలని సిఎం సూచించారు.  భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు వివరించారు,

ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణ పనులపై కూడా సిఎం ఆరా తీశారు. 9 ఫిషింగ్‌ హార్భర్లలో… తొలిదశలో నిర్మాణం చేపడుతున్న  4 ఫిషింగ్‌ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. తొలిదశలో ఉప్పాడ(తూర్పుగోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా), జువ్వలదిన్నె(నెల్లూరు) జిల్లాల్లో ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం జరుగుతోందని,  రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5 హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని అధికారులు సిఎంకు వివరించారు. వీటికోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామన్నారు.  ఫేజ్‌ 2లో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి),  ఓడరేవు(ప్రకాశం), కొత్తపట్నం(ప్రకాశం) జిల్లాలలో ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి,  సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓ రవిసుభాష్,  ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్‌, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సలహాదారు వీ ఎన్‌ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఉద్యోగులు పునరాలోచన చేయాలి :శ్రీకాంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్