భారత భూభాగంలో చైనా చొరబాట్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవడంలో డీడీఎల్‌జే వ్యూహం ( నిరాకరణ, దృష్టి మరల్చడం, అసత్యాలు, సమర్ధించుకోవడం)తో మోదీ సర్కార్ ముందుకెళుతోందని దుయ్యబట్టింది. విపక్షాలను నిందించడం మానుకుని చైనా దళాలను భారత్ భూభాగం వెలుపలకు నెట్టివేయడంపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోమవారం పేర్కొన్నారు.
మే 2020 నుంచి లడఖ్‌లో చైనా దూకుడుకు కళ్లెం వయేడంలో మోదీ ప్రభుత్వం డీడీఎల్‌జే వ్యూహాన్నే అనుసరిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి జై శంకర్ ఇటీవలి విమర్శలు కూడా చైనా పాలసీలో మోదీ ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకేనని ఆరోపించారు. 2020 మే నుంచి లడఖ్‌లో 65 పెట్రోలింగ్ పాయింట్స్‌లో 26 పాయింట్ల యాక్సెస్‌ను భారత్ కోల్పోయిందని అన్నారు.
2017లో రాహుల్ గాంధీ చైనా రాయబారితో సమావేశం కావడంపై మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన జైరమేష్ వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా పరంగా కీలకమైన దేశాల దౌత్యవేత్తలతో విపక్ష నేతలు భేటీ కాకూడదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సామరస్య వాతావరణంలో తరచూ కలుస్తూ ఉన్నా సరిహద్దుల్లో చైనా ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నదనే విషయం తనకు తెలియదని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పలుమార్లు అంగీకరించడం అసాధారణమని జైరాం రమేష్ పేర్కొన్నారు.