టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటించనున్నారు. జూలై 13న సాయంత్రం ఐదు గంటలకు వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, వారిలో స్ఫూర్తి నింపేందుకు మోడీ ఈ ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇండియా నుంచి జూలై 17న తొలి బ్యాచ్ క్రీడాకారుల బృందం టోక్యో కు బయల్దేరుతుంది, వాస్తవానికి 14నే వెళ్ళాల్సి ఉన్నప్పటికీ టోక్యో నిర్వహణ కమిటి సూచనల మేరకు మూడురోజులు ఆలస్యంగా ప్రయాణం చేస్తున్నారు. 19 లేదా 20న మరో బృందం జపాన్ వెళ్లనుంది.
మన దేశం నుంచి షుమారు 115 మంది అథ్లెట్లు విశ్వ క్రీడా పోటీల్లో వివిధ క్రీడంశాల్లో పాల్గొంటున్నారు. అయితే నిర్ధిష్టంగా ఎంతమంది ఆటగాళ్ళు అనేది భారత ఒలింపిక్స్ సంఘం రెండ్రోజుల్లో ఖరారు చేయనుంది. ఇటీవల ఆర్చరీ, షూటింగ్ విభాగాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి, బంగారు పతకాలు సాధించిన మన ఆటగాళ్ళు ఒలింపిక్స్ లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తారని దేశ క్రీడాభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించి స్ఫూర్తి ఇస్తే ఆటగాళ్ళకు మరింత ప్రేరణ కలిగిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జపాన్ లోని టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రస్తుత కోవిడ్ నేపధ్యంలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించకూడదని జపాన్ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు కరోనా తీవ్రత దృష్ట్యా టోక్యోలో జూలై 22 నుంచి ఆగష్టు 22 వరకు ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా ప్రకటించారు. ఒలింపిక్స్ ను సజావుగా జరపాలంటే ఇది తప్పనిసరి అని అయన వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం గత ఏడాదే ఈ విశ్వ క్రీడలు జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ మొదటి దశ కారణంగా వాయిదా పడ్డాయి.
క్రీడాకారులతో మోడీ ముఖాముఖి జరపనున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ‘#MyGovIndia’ ద్వారా వెల్లడించింది.