Wednesday, January 29, 2025
HomeTrending NewsMonsoon: కేరళ చేరుకున్న రుతుపవనాలు

Monsoon: కేరళ చేరుకున్న రుతుపవనాలు

గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ప్రకటించింది. లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. వారం రోజుల్లో ఇవి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేస్తుంటాయి. అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలో మరో మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం బలహీనపడిందని పేర్కొన్నది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్